విజయ్ దేవరకొండ - సమంతలకు గాయాలు : క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంతలు షూటింగ్‌లో గాయపడినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం "ఖుషి". శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఇటీవలే కాశ్మీర్‌లో పూర్తి చేసుకుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది.
ఇందులో విజయ్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్, సమంతలు గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. కాశ్మీరులోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నపుడు వీరిద్దరూ లిడ్డర్ నదిలో పడిపోయారని, దీంతో వారికి స్వల్పంగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి.
వీటిని చిత్ర బృందం తోసిపుచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. టీం అంతా కాశ్మీరులో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని విజయవంతంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు తెలిపింది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దని కోరింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని పేర్కొంది.