లింగమార్పిడి చేసుకున్న మహిళ పాత్రలో స్టార్ హీరో.. శృంగార తారగా శివగామి...
తమిళ హీరో విజయ్ సేతుపతి. ప్రయోగాత్మక పాత్రలకు పెట్టింది పేరు. అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాల్లో ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి విడుదలైన "పేట" చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషించారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "సైరా" సినిమాలోనూ ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
ఈ నేపథ్యంలో మరో విభిన్న పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. అదీకూడా లింగమార్పిడి చేయించుకున్న మహిళ పాత్రలో ఆయన నటించనున్నారు. ఈ చిత్రం పేరు 'సూపర్ డీలక్స్'. ఈ చిత్రంలో ఓ శృంగార తార పాత్ర ఉంది. ఇందులో సీనియర్ నటి, 'బాహుబలి' శివగామి నటించనుంది. నిజానికి ఈపాత్రకు సీనియర్ నటి నదియాను తొలుత సంప్రదించారు. కానీ, శృంగార తారగా నటించేందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో రమ్యకృష్ణను సంప్రదించగా, ఆమె ఏమాత్రం సంకోచించకుండా సమ్మతించారు.
ఈ చిత్రంలో సమంత ఓ హంతకురాలి పాత్రలో కనిపించనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వం వహిస్తున్నారు. వీరివీరి పాత్రలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా విడుదలయ్యాయి. తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు పీసీ శ్రీరాం, పీఎస్ వినోద్, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.