మన భాషే మరణిస్తే ఆ పాపం ఎవరిది? అమ్మ భాష పిలుస్తోంది రా... కదలిరా....!!

(ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని)

International Mother Language Day
ivr| Last Updated: శనివారం, 20 ఫిబ్రవరి 2016 (19:02 IST)
- వ్యాస రచయిత, డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు అధ్యాపకులు, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, తెనాలి(ఆంధ్రప్రదేశ్)

తూర్పు పాకిస్తాన్ లోని బెంగాలీలు, తమ మాతృభాషను అధికార భాషగా గుర్తించాలని ప్రభుత్వం పై పోరాటం చేసిన క్రమంలో ప్రభుత్వ దమనకాండలో నలుగురు యువకులు ప్రాణాలను అర్పించారు. ఈ యువకుల సంస్మరణార్ధం వారు అసువులుబాసిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కాలగమనంలో అంతరించిపోతున్న భాషలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గూర్చి, ఆయా భాష సమాజాల వారు తమ మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గూర్చి తెలియజేయాలనేది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం యెుక్క ముఖ్యోద్దేశ్యం. 
 
ప్రపంచవ్యాప్తంగా వ్యవహారంలో ఉన్న ఆరువేల భాషల్లో ఇప్పటికే మూడు వేల భాషలు మరణించాయని, ఇలాగే కొనసాగితే మరికొన్ని భాషలు మరణిస్తాయని, వాటిలో తెలుగుభాష ఒకటిగా ఉండబోతుందని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో ముప్ఫై శాతం మంది ఆ భాషను చదవకుండా, తల్లి భాషకు దూరమైతే ఆ భాష కాలక్రమంలో మృతభాషగా మారుతుందని యునెస్కో సూత్రీకరించి, తెలుగు భాషకు ఆ పరిస్థితి రాబోతుందని ఏనాడో హెచ్చరించింది. వ్యక్తి ఉనికిని చాటే అనేకాంశాలలో భాషా కూడా ఒకటి. అట్లే ఒక జాతిని ఉనికిని చెప్పడానికి కూడా భాషే ప్రధాన ఆధారం. 
 
ఒక జాతి మనుగడను చాటే పలు అంశాలలో ఆ జాతి మాట్లాడే భాష కీలకమైనది. కావున ప్రతి జాతి తమ మాతృభాషను కాపాడుకోవాలి. మానవుడు తాను పుట్టి పెరిగిన వాతావరణంలో మాట్లాడటానికీ, తన భావాల్ని- ఆలోచనల్ని- అభిప్రాయాల్ని వ్యక్తీకరించడానికీ, తల్లి పాలతో పాటు వంటబట్టించుకునే భాష మాతృభాష. అలాంటి మాతృభాషను పరిరక్షించి, భాషా వారసత్వాన్ని జాతికి అందించడమనేది పాలకుల బాధ్యత. కానీ దురదృష్టశాత్తు భాష ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఈ తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు మాతృభాషకు నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. ‘కన్నుపోయేంత కాటుక’లాగా తెలుగు పాలకులు ఆంగ్లభాషను తెలుగు వారిపై రుద్దారు. ‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్లుగా తెలుగు ప్రజలు కూడా తమ మాతృభాషాభిమానంలో వెనుకబడిపోయారు. ఆ ప్రతిఫలాన్ని నేటి తెలుగు జాతి అనుభవిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలు మాతృ భాషా చైతన్యంతో ముందుకు సాగుతుంటే, తెలుగు వారు మాత్రం ఆ స్పృహకు పూర్తిగా దూరం కావడం దురదృష్టకరం.దీనిపై మరింత చదవండి :