టాలీవుడ్ కింగ్ నాగార్జున-నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీ స్టారర్ దేవదాస్. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పైన అశ్వనీదత్ నిర్మించారు. ఈ నెల 27న దేవదాస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా దేవదాస్ టీమ్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. మహానటి అప్పుడు నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు. ఈ సినిమాకు మాత్రం పెద్ద హీరోలు నాకు తోడుగా, అండగా.. వాళ్ల భుజాలపై వేసుకుని నడిపించిన సినిమా కాబట్టి మీ ముందుకు వచ్చాను.
చాలా ఏళ్ల తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి ప్రతిష్మాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే సినిమా ఇది అవుతుంది. ఇద్దరు గొప్ప హీరోల నటనను మీరు సెప్టెంబర్ 27న చూడబోతున్నారు. చక్కటి వినోదంతో పాటు చిన్న సందేశం కూడా సినిమాలో ఉండబోతుంది. ఈ సినిమా గుండమ్మ కథలా క్లాసిక్ అవుతుందని భావిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే వైజయంతి మూవీస్ మరింత ముందుకు వెళ్లడానికి.. మా పిల్లలకు ఉత్సాహం ఇవ్వడానికి తోడ్పడుతుందని.. మీ అండదండలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.. అని చెప్పారు.
హీరో నాగార్జున మాట్లాడుతూ.. అశ్వినీదత్ గారు ఆఖరి పోరాటం అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ ఇంకా అలాగే ఉంది. పైగా ఇప్పుడు ఆయనకు ఇద్దరు హెల్ప్ కూడా వచ్చారు. తన కూతుళ్లు రూపంలో.. ఒక అల్లుడు రూపంలో హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నాలో వచ్చిన తేడా ఏంటంటే ఇప్పుడు టైమ్‌కు వస్తున్నాను. దేవ కారెక్టర్ ఇంటర్నేషనల్ డాన్ కారెక్టర్‌గా తీసుకున్నాం. దాంట్లో వయొలెన్స్ కానీ.. మాఫియా యాక్టివిటీస్ కానీ చూపించలేదు. ఎక్కువగా పర్సనల్ లైఫ్ చూపించాం. అందుకే నాకు కూడా కొత్తగా ఉంది.
జనరల్‌గా మాఫియా అనగానే అంతా ఒకలా ఊహిస్తారు. కానీ ఇది అలా ఉండదు. అదే కొత్తగా ఉంటుంది కూడా. దాస్‌తో ఉండే స్నేహమే దేవదాస్ సినిమా. ఒకరిని ఒకరెలా ఇన్ఫ్లూయెన్స్ చేస్తారనేది సినిమాలో మెయిన్ పాయింట్. ఇది ఏదో సీరియస్‌గా తీసిన సినిమా కాదు.. సరదాగా నవ్వుతూ ఉండే సినిమా.
మీకు ఎప్పుడున్నా రాజ్ కుమార్ హిరాణి సినిమా చూస్తే మున్నాభాయ్, సంజూ లాంటి సినిమాల జాబితాలో ఉంటుంది దేవదాస్. ముందు కృష్ణదాస్ అనుకున్నాం.. కానీ ఆ తర్వాత దేవదాస్ అని పెట్టారు. పైగా దత్ గారికి కూడా సెంటిమెంట్ మొన్నే మహానటి కూడా వచ్చింది. దేవదాస్ అనేది క్లాసిక్.. రీ కాల్ వ్యాల్యూ కూడా బాగుంటుంది. అందుకే రాయల్ సెల్యూట్ బాటిల్ కూడా పెట్టాం. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాం.. అందర్నీ బ్యాలెన్స్ చేయడం అనేది దర్శకుడికి ఈజీ కాదు. చాలా ప్రెజర్ ఉంది.
ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన సాంగ్ ఏమో ఏమో.. అది నానికి ఇచ్చారు. జలస్‌గా ఫీల్ అవుతున్నాను. సిధ్ శ్రీరామ్ పాడాడు. ఇక వారు వీరు కూడా బాగుంది. నా పక్కన అందమైన అమ్మాయి కూడా ఉంది. చేసే సినిమాలు బట్టి నా గెటప్ మారుతుంది. ఈ సినిమాలో కూడా యంగ్‌గా కనిపించడానికి సినిమాటోగ్రఫర్ స్యామ్ దత్ చాలా పెద్ద కంట్రిబ్యూటర్ సినిమాకు. అన్ని డిస్కస్ చేసుకని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు.. స్యామ్ తో మరోసారి వర్క్ చేయాలని ఉంది అని అన్నారు.
హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. నా కారెక్టర్ ఇందులో గాల్ నెక్ట్స్ డోర్‌లా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను అని చెప్పారు.
హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. నాగార్జున గారు సీన్ విషయాల్లో చాలా హెల్ప్ చేసారు. ఆయన చెప్పిన టిప్స్ అద్భుతంగా పనిచేసాయి. ఆయనతో పనిచేయడం.. స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. సెట్లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్స్ నాగార్జున గారు. ఆయన వచ్చిన తర్వాత భయపెట్టడాలు ఉండవు. చాలా కూల్‌గా ఉంటాడు. మల్టీస్టారర్స్ అని తేడా నాకు ఉండదు. మల్టీస్టారర్ అంటే ఎగ్జైట్ మెంట్ ఉంటుంది.
ఒకేసారి ఇద్దరు బెటర్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. నాకు అది నచ్చుతుంది. బేసిక్ గా ఓ లైన్ విన్నామో.. సత్యానంద్ గారు లాంటి సీనియర్లతో 4 నెలలు కూర్చున్న తర్వాత షూట్ చేయగలిగాను. ఇది ఏ సినిమా రీమేక్ కాదు. సొంత కథతోనే దేవదాస్ తెరకెక్కించాను. ఫ్రెండ్ షిప్ నేఫథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది. చిన్న సర్ ప్రైజ్ కూడా ఉంటుంది సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఫ్లాష్ బ్యాక్‌లు ఎన్ని ఉంటాయనేది సినిమా చూసి తెలుసుకోండి. అని చెప్పారు.
నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్, నరేష్ వికే, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య, నిర్మాత: అశ్వినీదత్, సంస్థలు: వైజయంతి మూవీస్ మరియు వయాకమ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, సినిమాటోగ్రఫర్: శ్యామ్ దత్ సైనూద్దీన్, సంగీతం: మణిశర్మ, ఆర్ట్ డైరెక్టర్: సాహీ సురేష్.