నటీనటులు: పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి-నిత్యా మీనన్-సంయుక్త మీనన్-మురళీ శర్మ-సముద్రఖని-రావు రమేష్-రఘుబాబు-తనికెళ్ల భరణి-నర్రా శీను తదితరులు. సాంకేతికత- ఛాయాగ్రహణం: రవిచంద్రన్, కథ: సాచి, సంగీతం: తమన్, స్క్రీన్ ప్లే-మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: సాగర్ కె.చంద్ర
ముందుమాట
పవన్ కళ్యాణ్ సినిమా `వకీల్‌సాబ్` తర్వాత వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. అప్పట్లో వకీల్‌సాబ్ కూడా రీమేక్. ఓ లాయర్ మహిళల న్యాయం కోసం ఏవిధంగా పోరాడాడు అన్నది పాయింట్. ఇక భీమ్లా నాయక్ అనేది మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుం కోషీయుం రీమేక్. ఒరిజినల్ వెర్షన్ తీస్తే ఆడుతుందా! లేదో అనే సందేహం చాలామందిలో వుంది. కానీ త్రివిక్రమ్ ఇందులో వచ్చాక మాటలు, స్క్రీన్ ప్లే చేయడంతో ఓ కొలిక్కి వచ్చింది. అది ఏమిటి? ఎలా తీశాడు? అనేది విశ్లేషణలోకి వెళదాం.
కథ:
ఓ అర్థరాత్రి అడవి మార్గంలో కారులో మందుకొట్టి నిద్రపోతూ ప్రయాణిస్తుంటాడు శేఖర్ అలియాస్ డానీ (రానా దగ్గుబాటి). షడెన్‌గా చెక్ పోస్ట్‌ను చూసి డ్రైవర్ రఘుబాబు కారు ఆపుతాడు. లోపల ఉన్న శేఖర్‌ను దిగమని ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తిస్తాడు. దాంతో అహం దెబ్బతిన్న డానీ పోలీసును కొడతాడు. అప్పుడు ఎస్.ఐ. భీమ్లా నాయక్‌ను (పవన్ కళ్యాణ్) పోలీసులు పిలవగానే వస్తాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి స్టేషన్ వరకు వెళుతుంది. డానీ ఫోన్‌ను పోలీసులు చెక్ చేస్తుండగా కె.టి.ఆర్., కె.సి.ఆర్. ఎం.పి.లు. మంత్రుల పేర్లు వుంటాయి.
దాంతో షాక్ అయి డానీకి మర్యాదలు చేస్తారు. కానీ అప్పటికే తప్పుచేశాడన్న పాయింట్‌తో భీమ్లా నాయక్ ఎఫ్.ఐ.ఆర్. కూడా రాసేస్తాడు. ఆ తర్వాత రెండు వారాలు జైలులో వుండాల్సి వస్తుంది శేఖర్‌కు. ఇక ఇగోకు కేరాఫ్ అడ్రెస్‌గా వున్న డానీ ఊరుకుంటాడా? అంతే ఇదిగా భీమ్లా నాయక్‌ను సస్పెండ్ చేయించేలా చేస్తాడు? అదెలా? ఆ తర్వాత ఏమి జరిగింది నిత్యమీనన్ పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
కథనం-
మలయాళ రీమేక్‌ను పోల్చుకుంటే భీమ్లా నాయక్ ఆసక్తిగా వుందనే చెప్పాలి. ఎందుకంటే అందులో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ పెద్దగా లేదు. కానీ భీమ్లా నాయక్‌లో ఫ్లాష్ బేక్ ఎపిసోడ్ పెట్టి, దాని ద్వారా ఊరి ప్రజలకు, మహిళలకు ఎలా రక్షణకుడు అయ్యాడనేది కొత్తగా వుంది. ఈ పాయింటే ముగింపుకు ముడిపెట్టి మహిళల సెంటిమెంట్‌కు టచ్ చేశాడు. ఇదంతా త్రివిక్రమ్ మార్క్ అని తెలిసిపోతుంది.
సంభాషణలుః
- సారీతో పోయేదానికి సంతకాల వరకు వచ్చింది. (భీమ్లా నాయక్‌కు సారీ మొదట్లో చెబితే సరిపోయేది కానీ జైలు శిక్ష పడ్డప్పుడు మంత్రి తనికెళ్ళభరణి అన్నడైలాగ్ సందర్భాను సారంగా వుంది)
- భీమ్లా నాయక్ ఉద్యోగం పోయి టీవీ చూస్తుండగా చిరంజీవి సినిమా వస్తుంది. రాగాల పల్లకిలో కోయిలమ్మ.. అంటూ సాగే ఆ పాటో చిరంజీవి `నా ఉద్యోగం పోయింది` అన్న డైలాగ్ వుంది. వెంటనే మా ఆయనకూ ఉద్యోగం పోయిందని నిత్యమీనన్ అనడం బాగుంది.
- ఇద్దరు రాజులు కొట్టుకుంటే మధ్యలో బలయ్యేది చుట్టుపక్కలవారే.. అన్న డైలాగ్. భీమ్లా నాయక్ సందర్భానుసారంగా పై అధికారి మురళీ శర్మకు చెబుతాడు. (ఈ డైలాగ్ చెబుతుంటే అచ్చం త్రివిక్రమ్ చెపుతున్నట్లే అనిపిస్తుంది)
- అడవిలో అరాచకాలు చేస్తున్న దుర్మార్గులను కట్టడిచేసే తరుణంలో ``అడవి అంటే అమ్మనుకుంటున్నావా ఏదిచేసినా భరించడానికి అడవి అంటే అమ్మోరు అంటూ .. భీమ్లా నాయక్ చేసే యాక్షన్ బాగుంది.
పెర్‌ఫార్మెన్స్-
ఇందులో నటించిన నటీనటుల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రానా, పవన్ కళ్యాణ్ పోటాపోటీగా నటించారు. నువ్వా? నేనా? అన్నంతగా వుంది. ఒకరకంగా ఏ ఒక్కరు లేకపోయినా కథ రక్తికట్టదు అనేట్లుగా వుంది.
- నిత్యమీనన్ కాస్త ఫెరోయిష్‌గా కనిపిస్తుంది.
- మిగిలిన పాత్రలన్నీ వారి పరిధి మేరకు నటించారు. ఎవరూ కృతంగా అనిపించలేదు. దర్శకుడు కేర్ కనిపించింది.
పాటలు-
ఇందులో పాటలకు పెద్దగా అవకాశం వుండదు. కేవలం కథ హీరో. కానీ. తెలంగాణ జానపదం టైటిల్ సాంగ్ కొత్తగా అనిపిస్తుంది. దానికి నృత్యం కూడా బాగుంది.
కెమెరా- సంగీతం-
అటవీ నేపథ్యం కనుక సినిమాటో్గ్రఫీ హైలైట్‌గా వుంది. థమన్ సంగీతం ఆకట్టుకునేలా వుంది. శివమణి డ్రమ్ బ్యాక్ డ్రాప్‌కు బాగా సింక్ అయింది.
విశ్లేషణః
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ప్రతి సన్నివేశంలోనూ హడావుడి కనిపిస్తుంది. ప్రధాన పాత్రధారులు చేయాల్సిన హంగామా అంతా చేస్తారు. అరుపులు.. కేకలు.. పంచ్ డైలాగులు.. ఎలివేషన్ సీన్లు.. ఫైట్లు.. పాటలు.. వీటన్నింటికీ మించి ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేసే బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా మన వాళ్లకు కావాల్సిన మసాలా అంతా ఉంది భీమ్లా నాయక్‌లో. హైలైట్లుగా చెప్పుకోవడానికి భీమ్లా నాయక్‌లో చాలా అంశాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్-రానాల ప్రతి ఫేసాఫ్ సీనూ డైనమైట్ లాగా పేలింది. ఇద్దరూ ఎవరూ తగ్గకుండా పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌తో ప్రతి సన్నివేశాన్నీ పైకి లేపారు. పవన్‌ను ఇలాంటి పాత్రల్లో ఇంతకుముందు చూశాం కాబట్టి కొత్తగా అనిపించదు కానీ.. రానాను ఇలాంటి పాత్రలో చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది.
ముఖ్యంగా ముగింపులో వచ్చే కొత్త ట్విస్టు ఆకట్టుకుంటుంది. తన మాటలతో ప్రతి సన్నివేశాన్నీ ఆసక్తికరంగా మార్చారు త్రివిక్రమ్.. త్రివిక్రమ్ రాత వరకు తన పనిని సమర్థంగా చేస్తే.. దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సాగర్ చంద్ర పనితీరు ప్రశంసనీయం. అయితే గతంలో తెలుగులో వచ్చిన సినిమాల ముద్ర ఇందులో కనిపిస్తుంది. అయ్యారే.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు చూసిన వారికి. అది అర్థం అవుతుంది. ఫైనల్‌గా ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడొచ్చు.
నీతి-
ప్రతి పౌరుడూ రూల్స్ పాటించాల్సిందే. అధికారం, దర్పం వుండేవారికి తండ్రి అండతో కొడుకులు తప్పులు చేయిస్తే భీమ్లా నాయక్ వంటి పోలీసు అధికారి ఎలా పనిషిమెంట్ ఇస్తాడనేది ఇందులో చూపించాడు. ఎంత పొగరున్న పొలిటీషియన్ కొడుకైనా ఆడవారిని ఎలా గౌరవించాలో రానా పాత్రలో చూపించాడు.
రేటింగ్-3/5