నటీనటులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, అలీ, సునీల్, జయ ప్రకాష్, బెనర్జీ, రఘు బాబు, సత్యం రాజేష్, మధు నందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రాఫర్స్: గంగనమోని శేఖర్, ఈశ్వర్, స్టోరి, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి గొట్టిపాటి, నిర్మాత: అవనీంద్ర కుమార్, శ్రవణ్ భరద్వాజ్
ఇటీవలే సరికొత్త కథలతో యువ దర్శకులు వెండితెరలో తన టాలెంట్‌ను పరీక్షించుకుంటున్నారు. అందులో దాదాపు ఎక్కువశాతం సస్పెన్స్ కథాంశాలనే ఎంచుకుంటున్నారు. అలాంటి కోవలోనే దర్శకులు కృష్ణ చైతన్య కథ వెనుక కథ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ముందుకు వచ్చాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
సినిమా దర్శకుడు కావాలనేది అశ్విన్ (విశ్వంత్) డ్రీమ్. అందుకోసం కొందరి నిర్మాతలను సంప్రదిస్తాడు. కథలు చెబుతాడు. ఎట్టకేలకు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సినిమా తీయడానికి ముందుకు వస్తాడు. అప్పటికే తన మేనమామ కూతురుని ప్రేమిస్తాడు. కానీ అశ్విన్‌కు సినిమా హిట్ కొట్టాక తన కుమార్తెను ఇస్తానని మేనమామ మెలిక పెడతాడు. దాంతో పట్టుదలతో ఎలాగైనా మంచి సినిమా తీయాలని పూర్తి చేస్తాడు. కానీ విడుదలకు ముందు పబ్లిసిటీకి డబ్బులు లేవని నిర్మాత ట్విస్ట్ ఇస్తాడు. దాంతో ఒక పక్క తన కెరీర్, మరోపక్క పెండ్లి ఇవన్నీ గుర్తుకువచ్చి తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ఇదే టైంలో ఈ సినిమాలో నటించిన నటీనటులు మిస్ అవుతారు. అందులో రాజుతోపాటు అమ్మాయిలు చనిపోతాడు. ఇక అక్కడనుంచి ఈ మిస్టరీ ఎలా జరిగింది? కారణం ఏమిటి? పోలీసు అధికారి సునీల్ ఈ మిస్టరీని ఛేదించాడా? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ :
ఇలాంటి కథలకు ఊహించని మలుపులు ఆసక్తిని పెంచుతాయి. మొదటి షాట్తోనే ఓ హత్యతో దర్శకుడు ఆడియన్ లో ఆసక్తి కలిగించాడు. ఆ తర్వాత విశ్వంత్ లవ్ స్టోరి తో పాటు తను డైరక్షన్ చాన్స్ ల కోసం వెతకడం ఆసక్తికరంగా డిజైన్ చేశారు దర్శకుడు. ఇక అర్థాంతరంగా సినిమా ఆగిపోవడం వంటివి రియల్ గా జరిగిన సంఘటనలుగా మార్చాడు. మీడియాలో ఈ సినిమా సంచలనంగా మారడం, ఈ క్రమంలో హీరో అసలు ఏం జరుగుతోందని తెలుసుకొని అసలుఈ వరుస హత్యలకు కారకులు ఎవరో ఛేదించడం ఇలా కథ అనేక మలుపులతో , ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుంది.
ఫస్టాఫ్ అంతా కొంత స్లో గా సాగినా, సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు సినిమాను మరో మెట్టుకి తీసుకెళతాయి. సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సునీల్ కి సంబంధించిన సీక్వెన్స్ కూడా కొంత ల్యాగ్ అయిన ఫీలింగ్ వచ్చినా...అసలు సునీల్ అలా ఎందుకు మారాడు అనేది విషయం ఆడియన్స్ కి తెలియాలంటే ఆ మాత్రం తప్పదనిపిస్తుంది.
సినిమా టైటిల్ లోనే ఇందులో మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలో డైరక్టర్ అశ్విన్ , ప్రొడ్యూసర్ జయ ప్రకాష్ , పోలీస్ ఆఫీసర్ గా నటించిన సత్య... వీరి ముగ్గురి జీవితాలకు సంబంధించిన కథ ఇది. ఎలాగైనా మంచి సినిమా తీసి హిట్ కొట్టాలన్న కసి హీరోది. సినిమా నిర్మించాలన్న తన కూతురి కలను నెరవేర్చాలన్నది ప్రొడ్యూసర్ పట్టుదల, తప్పు జరిగితే ఎంత దూరమైనా వెళ్లే పోలీస్ ఆఫీసర్ సత్య. కానీ వీరి జీవితాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి వారి కలలను, వారి ఆశయాలను దెబ్బతీస్తాయి. ఆ పరిణామాలు ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
డైరక్టర్ గా అశ్విన్ నటన ఓకే. సునీల్ ఇంతకూ ముందు ఇలాంటి క్యారక్టర్ చేసిన ఇందులో మాత్రం సినిమాకు సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. నిర్మాతగా చేసిన జయప్రకాష్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రఘుబాబు, మధునందన్ , సత్యం రాజేష్, భూపాల్ , ఖయ్యుం పాత్రలకు తగ్గట్టుగా నటించారు. హీరోయిన్ కి పెద్ద స్కోప్ లేదు.
దర్శకుడు టైటిల్ లోనే కొత్తదనం చూపాడు. అక్కడే క్రీయేటివిటి కనిపించింది. మల్టిపుల్ లేయర్స్ ఉన్న కథని తెరకెక్కించడం ఆషామాషీ విషయం కాదు. కానీ కృష్ణ చైతన్య సినిమాను ఆసక్తికరంగా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్ లో ఒక్కో ట్విస్ట్ ని రివీల్ చేస్తూ ఆడియన్ ని థ్రిల్ కి గురి చేసిన విధానం ప్రశంసించాల్సిందే. అక్కడక్కడా చిన్న చిన్న తప్పిదాలు ఉన్నా తడబాటు లేకుండా ప్రతి సన్నివేశాన్ని ఇంట్రస్టింగ్ గా, ఇన్నోవేటివ్ గా తెరకెక్కించాడు డైరక్టర్ . నటీనటులు, టెక్నీషియన్స్ దగ్గర నుంచి మంచి వర్క్ రాబట్టుకున్నాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హెల్పయ్యాయి. నిర్మాతలు కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టారు. ప్రేక్షకులు ఆదరణతో ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి. కొత్త తరానికి ప్రోత్సహం ఉంటుంది.
రేటింగ్ః 2,5/5