శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (14:35 IST)

భాగ్యలక్ష్మి 'హైదరాబాద్‌ లవ్‌ స్టోరీ'... రివ్యూ రిపోర్ట్

తెలుగు సినిమాలో లవ్‌ స్టోరీలు సర్వసాధారణం. ఎవరికివారు తమ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన కథల్లోంచి ప్రేమకథలు తెరకెక్కిస్తుంటారు. 'అలా ఎలా' అంటూ ఏడాది క్రితం గ్రామీణ నేపథ్యంతో చక్కటి లవ్‌స్టోరీతో విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు రాహుల్‌.. ఈసారి హైదరాబాద్‌

హైదరాబాద్‌ లవ్‌ స్టోరీ నటీనటులు : రాహుల్‌ రవీంద్రన్‌, రేష్మీ మీనన్‌, జియా, రావు రమేష్‌, అంబటి, రమాప్రభ, షఫీ, సన, సూర్య, రచ్చ రవి మరియు ఇతరులు. సాంకేతికత: కథ, డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: రాజ్‌ సత్య, కెమెరామెన్‌: బి వీ అమర్నాథ్‌ రెడ్డి, మ్యూజిక్‌: సునీల్‌ కశ్యప్‌, ఎడిటర్‌: ఎం.ఆర్‌. వర్మ, నిర్మాతలు: ఎం.ఎల్ రాజు, ఆర్‌.ఎస్‌ కిషన్‌, వేణు గోపాల్‌ కొదుమగుళ్ళ, బ్యానర్‌: సినిమా పీపుల్‌, సమర్పణ: మాస్టర్‌ ప్రణవ్‌ తేజ్‌.
 
విడుదల : ఫిబ్రవరి 23 శుక్రవారం.
తెలుగు సినిమాలో లవ్‌ స్టోరీలు సర్వసాధారణం. ఎవరికివారు తమ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన కథల్లోంచి ప్రేమకథలు తెరకెక్కిస్తుంటారు. 'అలా ఎలా' అంటూ ఏడాది క్రితం గ్రామీణ నేపథ్యంతో చక్కటి లవ్‌స్టోరీతో విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు రాహుల్‌.. ఈసారి హైదరాబాద్‌ బేస్డ్‌ కథతో ముందుకు వచ్చాడు. హైదరాబాద్‌ పేరుతో లవ్‌స్టోరీ తెరకెక్కించిన రాజ్‌ సత్య కొత్త ప్రయోగమే చేశాడు. నిర్మాణపు విలువలు కూడా బాగున్న ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ :
భాగ్యలక్ష్మి(రేష్మిమీనన్‌) మధ్యతరగతి యువతి. తండ్రి కారు మెకానిక్‌. తను సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిని. మిత్రులతో పార్టీ చేసుకుని డ్రై చేస్తూ కారు గుద్దేస్తుంది. హైదరాబాద్‌లో ఎల్‌అండ్‌టి.. ఫ్లైఓవర్‌ ఇంజనీర్‌ రాహుల్‌(రాహుల్‌ రవీందర్‌) భాగ్యలక్ష్మి పరిస్థితి చూసి ఇంటికి చేరవేస్తాడు. అలా అతన్ని మొదటి చూపులోనే ప్రేమించేస్తుంది. రాహుల్‌ కూడా తనంటే ఇష్టమే. అయితే ఓ సంఘటనతో రాహుల్‌ గతాన్ని భాగ్యలక్ష్మి బయటపెట్టేస్తుంది. దాంతో రాహుల్‌ జంటిల్‌మేన్‌ కాదనీ, తనొక గే అనే భావనకు వచ్చేస్తుంది. నిదానంగా తనకు దూరంగా వుంటుంది. విషయం తెలిసిన రాహుల్‌ ఫ్యామిలీ డాక్టర్‌ ఆమెకు అసలు నిజాన్ని వెల్లడిస్తాడు. అది ఏమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
నటనా పరంగా రాహుల్‌ రవీంద్రన్‌ ప్రేమికుడిగా గత చిత్రాల్లో మాదిరిగా హావభావాలను చక్కగా పలికించాడు. భాగ్యలక్ష్మిగా రేష్మిమీనన్‌ చూడముచ్చటగా వుంది. అమాయకత్వం కలగలిపిన పాత్రను మెప్పించింది. డాక్టర్‌గా రావు రమేష్‌ పాత్ర సరిపోయింది. అంబటి శ్రీను.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడిపే వ్యక్తిగా నటించాడు. తను ఎంటర్‌టైన్‌ చేయాలని ప్రయత్నించాడు. మేల్కొటి అతని నాన్నగా నటించాడు. సన, సూర్య, రాహుల్‌ తల్లిదండ్రులుగా నటించారు. వీరుకాక సినిమాకు కీలకంగా మారిన ముస్లిం పాత్రను అజయ్‌ చేశాడు. ఇలా ప్రతివారూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
 
సాంకేతికపరంగా కెమెరామెన్‌ పనితనం బాగుంది. సంగీతపరంగా సునీల్‌ కశ్యప్‌ బాణీలు కొత్తవికాకపోయినా వినడానికి వినసొంపుగా వున్నాయి. దర్శకుడు రాజ్‌ సత్య తీసుకున్న అంశం కాస్త ప్రయోగమే చెప్పాలి. రొటీన్‌ ప్రేమకథే అయినా దానికి హిందూ, ముస్లిం అనే తారతమ్యాలు ప్రేమకు లేవనే విషయాన్ని చెప్పదలిచాడు. అది ప్రేమికుల మధ్య కాకుండా... బాల్యస్నేహితులుగా వున్న ఇద్దరు వ్యక్తుల కథను తీసుకున్నాడు. ఓ అనాథను రాహుల్‌ తన తల్లిదండ్రుల సహకారంతో సొంత తమ్ముడుగా భావించి తీసుకున్న నిర్ణయం ఇందులో కీలకం. మానవతా విలువలు మృగ్యమైపోతున్న దశలో ఇటువంటి అంశాన్ని తీసుకుని తను అంతా సమానమే అని చెప్పే ప్రయత్నం చేశాడు. 
 
ప్రాణాపాయ స్థితిలో వున్న వ్యక్తిని కాపాడాలంటే కులాలు, మతాలు చూడ్డం ఎంత మూర్ఖమో తెలియజేశాడు. అదేవిధంగా ప్రేమ పొందడానికి మనసులో ఫీల్‌ కలగాలి. అది లేకపోతే అదే ప్రేమేకాదు. తను ప్రేమించిన అమ్మాయి దూరమవుతున్నప్పుడు ఏదో కోల్పోయామన్న భావన కల్గడమే నిజమైన ప్రేమ. దాన్ని తెలియజెప్పేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే... తండ్రి చనిపోయాడని తెలిసి కూడా... స్నేహితుని గురించే ఆరాటపడే సన్నివేశం ఇబ్బందిగా అనిపిస్తుంది. 
 
ఎందుకంటే చిన్నతనంలో స్నేహితునిపై ప్రేమ వేరు. పెద్దయ్యాక.. కాస్త మెచ్యూర్డ్‌ అవుతుంది. తల్లి,తండ్రి తర్వాతే ఎవరైనా.. ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా డీల్‌ చేస్తే మరింత బాగుండేది. చిత్రంలో సందర్భానుసారంగా సంభాషణలు బాగా రాసుకున్నాడు దర్శకుడు. హీరోహీరోయిన్లపైన కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ చూపించాడు. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కన్పిస్తుంది. అయితే.. ఎటువంటి అసభ్యత, అశ్లీలం లేని ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.