నటీనటులుః రానా దగ్గుబాటి, తమిళ నటుడు విష్ణు విశాల్ , జోయా హుస్సేన్ - శ్రియ పిల్గావోంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
సాంకేతికతః కెమెరాః అశోక్‌కుమార్, మాటలుః వనమాలి, సంగీతంః శాంతన్ మోత్రా, నిర్మాణంః ఈరోస్ ఇంటర్‌నేషనల్, కథ, కథనం, దర్శకత్వంః ప్రభు సోల్‌మన్.
బాహుబలి తర్వాత విశ్వవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న రానా నటించిన సినిమా `అరణ్య`. ఇది హిందీలో హాథీమేరేసాథీ, తమిళంలో కాదన్, తెలుగులో అరణ్య పేరుతో ఈ శుక్రవారమే విడుదలవుతుంది. కానీ కోవిడ్ వల్ల హిందీలో `హాతీమేరాసాథీ` పేరుతో రూపొందిన ఈ సినిమా విడుదల కాలేదు. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా అడవిలో ఏనుగుల సంరక్షణ కోసం రానా ఏం చేశాడనేది కథ. ఇది సిక్కింలోని వన్య ప్రాణ పరిరక్షకుడు ఖాజీరంగా జీవిత కథ ఆధారంగా దర్శకుడు తెరకెక్కించాడు. మరి ఆయన ఎలా చెప్పాడో చూద్దాం.
కథః
తాత ముత్తాల నుంచి అరణ్యంలో నివశిస్తూ అక్కడ వన్యప్రాణుల్ని ముఖ్యంగా ఏనుగులను సంరక్షించే కుటుంబానికి చెందిన వాడు నరేంద్ర భూపతి (రానా). అడవిని కాపాడుతున్నందుకు ఫారెస్ట్ ఆఫ్ ఇండియా పేరుతో రాష్ట్రపతి అవార్డుకూడా పొందుతాడు. అందుకే ఆయన్ను ఆచుట్టుపక్కల ప్రజలు ఆరణ్య అని పేరు పెట్టి పిలుచుకుంటారు. సాఫీగా సాగుతున్న అరణ్య జీవితంలో ఒక్కసారిగా కుదుపు వస్తుంది. వారసత్వంగా హక్కు కలిగిన అరణ్య భూముల్ని అభివృద్ధిపేరుతో కార్పరేట్ కంపెనీకి టౌన్‌షిప్ కోసం అటవీ మంత్రి అమ్మేస్తాడు. దానివల్ల పచ్చని అడవులు నాశనం చేయడమేకాకుండా ఏనుగులకు నివాసం లేకుండా పోవడమేకాకుండా తాగునీటిని కూడా కోల్పోతుంది. ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వలస పోవాల్సివుంటుంది. మంత్రి, ప్రభుత్వయంత్రాంగం చేసే అరాచకాలను అరణ్య ఎలా అడ్డుకున్నాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? మరి ఈ పోరాటంలో నగ్జలైట్ల పాత్ర ఏమిటి? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ఇది అస్సాంలో జరిగిన కథే అయినా వర్తమాన పరిస్థితులను చూస్తే ప్రతి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్య. పచ్చని అటవీ ప్రాంతంలో నివాసముంటున్న ఆదివాశీల హక్కులకై చాలా చోట్ల చేస్తున్న పోరాటమే. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నో ఏళ్ళుగా శ్రీశైలం, శ్రీకాకులం వంటి పలు చోట్ల అరణ్య చేస్తున్న పోరాటమే కనిపిస్తుంది. కానీ ఫైనల్‌గా పాలకులు ఏం చేయాలనుకుంటారో అదే చేసి చూపిస్తారు. కానీ సినిమాపరంగా స్వార్థపరులు, ఇగోయిసట్లు అయిన పాలకులకు ఎలా చెక్ పెట్టవచ్చో దర్శకుడు చూపించాడు. ఈ పోరాట క్రమంలో కొన్నిచోట్ల బ్రేకులు పడ్డాయి. దానితో కనెక్టెవిటీ పోయింది.
1. పిచ్చోడనే ముద్రవేసి అరణ్యను జైలులో చిత్రహింసలు పాలు చేస్తారు. కానీ అతను ఎలా బయటకు వచ్చాడో చూపించలేదు.
2. నగ్జలైట్ పోరాట నాయకురాలు ఎపిసోడ్ కూడా అర్థంతరంగా ముగించారు. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశంకూడా కట్ చేశారు.
ఇక మొత్తంగా చూస్తే ఈ సినిమా అద్భుత ప్రయోగమే చెప్పాలి. రొటీన్ కథలు వస్తున్న తరుణంలో యధార్థ గాధను సినిమాటిక్‌గా తీసినందుకు అభినందించాలి. ముఖ్యంగా అరణ్య పోరాటంతోపాటు తమ హక్కుల కోసం చేసే ఆదివాసీల పోరాటాన్ని రాజకీయనాయకులు ఎలా అణచివేస్తారనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
- రానా నటన అభినందనీయం, ఆహార్యం, నడక, పక్షుల బాష మాట్లాడేవిధానం చాలా బాగుంది. సిటీకి వచ్చాక యాక్షన్ సన్నివేశాల్లో చాలా దూరం పరుగెత్తటంలో అతని కష్టం కనిపించింది. ఏనుగులను చంపే పోలీసుపై అరణ్య చేసే పోరాటం పీక్ అని చెప్పాలి.
సాంకేతికతః
- పాటపరంగా `చినికేసే ఆ చిరుగాలి. చినుకేస్తే ఆడే నెమలి. కిలకలమమని నవ్వే కోకిల పాట బాగుంది. నీలిమబ్బునడుగు నిజం తెలుస్తుంది. అనే పాట కూడా సూటయింది. దానికితోడు సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్. ప్రేక్షకుడిని అరణ్యంలోకి అలా తీసుకెళ్ళేలాచేశాడు.
- సంభాషణల పరంగా వనమాలి సన్నివేశపరంగా బాగున్నాయి. ఏనుగులే అడవికి మూలస్తంభాలు. అవి వదిలే పెంటవల్ల మొక్కలయి వృక్షాలయ్యే తీరును సంభాషణలరూపంలో చొప్పించాడు. ఒక కరెంట్ స్తంభం నాటాలంటే 100 చెట్లు నరకాలి. అందుకే మాకు కరెంట్ వద్దన్నామని.. అరణ్య సందర్భానుసారంగా మాట్లాడతాడు.
- మరోవైపు. ప్రకృతి సంపదను కాపాడతానని ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెబుతున్నానంటూ మంత్రి అయ్యాక చెప్పిన మాటకు విరుద్ధంగా ప్రవర్తించడం, అందుకు పోలీసు యంత్రాంగం పనిచేయడం వర్తమాన రాజకీయముఖ చిత్రంగా కనిపిస్తుంది.
- ఎన్నో ఏళ్ళుగా ఆదివాసీలు తమ హక్కులకోసం ఇటువంటి పోరాటాలే చేస్తున్నారు. అందులో రంపచోడవరం నేపథ్యంలో ఈ తరహా కథలనే సినిమాలుగా తీసిన నారాయణమూర్తి చిత్రాలు పలు వున్నాయి.
- ఎడిటింగ్‌లో లోపం వల్ల కనెక్టవిటీ దెబ్బతింది. బహుశా కథకు సమాంతరంగా సాగే లవ్‌స్టోరీ రానా కథకు బ్రేక్ అని భావించినట్లున్నారు.
- ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం. అని విలేకరి హెడ్‌లైన్ రాస్తే.. అందుకు పనిష్‌మెంట్‌గా మంత్రి ఆమె ఉద్యోగం పీకేయడం వంటివి చాలామంది విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలే.
- అసలు అడవులు లేకపోతే పర్యావరణ తుల్యత ఎలా తప్పుతుంది. భూకంపాలు ఎలా వస్తాయి. రోగాలు ఎలా వస్తాయో అనేది ముగింపులో అరణ్య చెబుతాడు. ఒకరకంగా కోవిడ్ కూడా పర్యావరణ సమతుల్యత వల్లేనని మేథావులు కూడా ఘోషిస్తున్నారు.
ఆలోజింపచేసే అంశాలు.
- అశోకుడు చెట్లు నాటాడు. అని పుస్తకాల్లో రాసి పిల్లల చేత చదివించడం కాదు. వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా రాయాలని చెప్పే సంభాషణ ఆలోచింపజేస్తుంది. ఇలా చక్కటి సంభాషణలతో సరికొత్త ప్రయోగం చేశాడు దర్శకుడు.
- మన విధి లోనో, మాన ఇంటి పక్కనో, దాదాపుగా ప్రతి చోట, ప్రతి రోజు చూస్తున్న/తెలిసిన సమస్యే. .అదే రాజకీయ నేపథ్యంతో పెద్దల అండ దండలతో యద స్వేచ్చగా స్థలాలని కబ్జా చెయ్యేడ్డం, ఎదురు తిరిగితే రాజకీయ పలుకబడిని ఉపయోగించడం స్థల యజమాని నోరు ముయించడం మామూలే..
- ఈ సినిమా చూశాక. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌దగ్గర అరణ్యపార్క్ కొంత భాగాన్ని అప్పటి ప్రభుత్వం ఓ కార్పొరేట్ సంస్థకు లీజుకు ఇవ్వడం, అక్కడ ఇప్పటికీ ఇంకా బిల్డింగ్‌లు కట్టడం చూస్తుంటాం.
- ఆ తర్వాత అసలు జూబ్లీహిల్స్‌లోని ఆ పార్క్‌ను సిటీకీ అడ్డంగా వుందని ఏదో చేయాలని చూస్తే జాతీయ వన్య రక్షణ పర్యావరణ పరిక్షణ సంఘం, వాకర్స్ అసోసియేషన్ కూడా పోరాటం చేసి అడ్డుకున్న సంగతి పేపర్లలో రావడం గుర్తుకురాకమానదు. ఇలాంటివి దేశంలో ఎన్నో సంఘటనలు.
-- మొత్తానికి సినిమా కాబట్టి కబ్జా రాయుళ్లు ఓడిపోయి హీరో గెలిచాడు. నిజ జీవితం లో కూడ అట్లా జరిగితే ఎంత బాగుంటుందో.
- మొత్తం మీద ఈ అరణ్య కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కుటుంబంతో సహా హాయిగా చూడతగ్గ చిత్రమిది.
రేటింగ్ః 3/5