మూడేళ్ల నాడు హిట్ అయిన పుష్ప: ది రైజ్‌కు ఇది సీక్వెల్ కావడంతో పుష్ప: ది రూల్ తో దర్శకుడు సుకుమార్ ముందుకు తెచ్చాడు. టైటిల్ కు తగినట్లు పుష్పరాజ్ ఇంటరేషన్ మాఫియా మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదగడమేకథావస్తువు. రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ అయిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కూలీగా మొదలుపెట్టి ఎర్రచందనం సిండికేట్ కు నాయకుడిగా ఎదిగిన పుష్ప (అల్లు అర్జున్) కథే ఇది. మొదటి పార్ట్ లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫాహద్ ఫాజిల్)ను ఘోరంగా అవమానించడంతో అతను ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ క్రమంలో పుష్పరాజ్ తో సవాల్, ప్రతిసవాల్, ఎత్తుకు పైఎత్తులు వేసి అడ్డుకోవడానికి చూసిన షెకావత్ ప్రతీసారి ఫెయిల్ అవుతాడు. చివరికి షెకావత్ చేతులెత్తేస్తాడా? లేదా అనేది ఈ సినిమా.
మరోవైపు సి.ఎం.ను కలవడానికి వెళుతున్న పుష్పతో అతని భార్య ఓఫొటో అడుగుతుంది. అది నెరవేరకపోగా అవమానానికి గురైన పుష్ప రాజ్ ఏం చేశాడనేది మరో ట్విస్ట్. ముచ్చటగా మూడోది ఏమంటే, తండ్రి పేరుగానీ ఇంటిపేరు కానీ పెట్టుకోవడానికి ఇష్టపడని అజయ్ తన సోదరుడైన పుష్పరాజ్ కు చేసిన అవమానాన్ని ఏవిధంగా పాజిటివ్ గా పుష్ప మలుచుకున్నాడనేది సినిమాలోని ప్రధాన అంశం. ఈ మూడు అంశాలతో సినిమా కొనసాగుతుంది. మరి ఏమిటి? అనేవి సినిమాలో చూడాల్సిందే.
Rao ramesh, arjun, anasuya
సమీక్ష:
ప్రాంతీయ సినిమా అయినా అంతర్జాతీయ సినిమా అయినా సెంటిమెంట్ అనేది ప్రధానం దాన్ని అన్న కూతురు సెంటిమెంట్ తో పుష్పరాజ్ పై ఏవిధంగా ప్రభావం చూపింది అనేది సుకుమార్ చాలా బాగా డీల్ చేశాడు. సాధారణ కూలీ ఎర్రచందనం సిండికేట్ ను తన గుప్పెట్లోకి తీసుకునే డాన్ స్థాయికి ఎదుగుతాడు. ఈ జర్నీలో చాలా కథ ఉంటుంది. ఆ కథలో ఎన్నో మలుపులుంటాయి. అందులో బిజినెస్ చేసేవారంతా విలన్లే. రాజకీయనాయకులు కూడా విలన్లే. అవసరానికి వారిని ఏవిధంగా వాడుకున్నాడనేది ఇందులో చూపించాడు. అసలు ఎర్రచందనం ఎలా పోలీసులకు కనబడకుండా బోర్డర్ దాటించాలనే దానిపై దర్శకుడు బాగా స్టడీ చేసి తీసినట్లుంది.
అమ్మవారి జాతర ఎపిసోడ్ లో చీర ఎందుకు కట్టుకున్నాడనేదానికి లాజిక్ చూపించాడు. అక్కడ జరిగే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. పుష్ప కలగనే జపాన్ ఎపిసోడ్ లో సాగే ఫైట్ కూడా హాలీవుడ్ సినిమా పైట్లను టకటకా చూపించేశాడు. అయితే ఇది కథను ప్రొలాంగ్ చేయడానికి తీసినట్లుంది. ఇక చివరిలో అజయ్ కూతురు కోసం పుష్ప పోరాడే సన్నివేశాలు మరో హైలైట్. ఇవన్నీ సినిమాటిక్ గా వున్నా చూసే మాస్ ప్రేక్షకుడికి కాస్త కనువిందు కలిగిస్తుంది.
ఇక పాటలపరంగా అమ్మవారి జాతర పాట మినహా పెద్దగా లేవు. కిస్సింగ్ సాంగ్, ఫీలింగ్ సాంగ్ కూడా కథనాన్ని పొడిగించడానికి వున్నాయి. కానీ శ్రీలీల డాన్స్ వెండితెరపై పెద్ద కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగింది కెమెరామెన్ పనితనం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం తదనుగుణంగా వున్నాయి. ఫీలింగ్ రావడం అనే ఎపిసోడ్ తో పుష్ప, శ్రీవల్లి బెడ్ రూమ్ కు వెళ్లడం వంటివి నిడివి తగ్గిస్తే బాగుండేది. కాకపోతే భార్య పై ఎంతప్రేమ వుందో తెలియజేసే సన్నివేశం శ్రీవల్లి కాళ్ళను పుష్ప పట్టుకోవడం, ఆమె కాలితోనే తన గడ్డెంపై తగ్గేదేలే అన్నట్లుగా చూపించడం సుకుమార్ స్టయిల్ గా చెప్పవచ్చు.
సంభాషణల పరంగా కొన్ని మాటలు ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ విస్సా, సుకుమార్ తన పెన్ కు పనిపెట్టారు. పెళ్లాం మాట వింటే ఎలా వుంటుందో చూపిస్తానని పుష్ప అనడం, అవసరం వున్నప్పుడు ఫండ్ ఇస్తే స్మగర్లు ప్రభుత్వాన్ని మార్చేవిధంగా సంభాషణలు, డబ్బుఅంటే లెక్కలేదు. పెద్దలంటే గౌరవం లేదు. కానీ ఏదో కసి వుందంటూ.. సెంట్రల్ నాయకుడు జగపతిబాబు చేత అనిపించడం కొందరికి కనెక్ట్ అయ్యేలా వుంది. అదేవిధంగా పుష్ప నిర్ణయాలు తీసుకుంటాడు. అది కరెక్టే అవుతుంది. హెలికాప్టర్ లో పుష్ప వెళుతుంటే.. పైకి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకోడు. అంటూ సాగే సంభాషణలు సన్నివేశపరంగా వున్నా సోషల్ మీడియాకు మంచి సరుకులాంటి మాటలు.
యాక్షన్ పరంగా మాస్ కూ, ఫ్యాన్స్ కు పైసా వసూల్ సినిమాగా తయారైంది. అయితే పుష్ప 2లోని ఎక్కువ భాగం హీరో బిల్డప్ షాట్స్ పైనే సాగుతుంది. ఇది కేవలం సినిమాపరంగానే చూసుకోవాలి. ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటే గందరగోళం జరుగుతుంది. సినిమా లాజిక్ తో స్మగ్లింగ్ విషయంలో ఫ్రీనెస్ దర్శకుడు తీసుకున్నాడు. షెకావత్ ఎలా అవమానానికి గురయ్యాడు? అనేవి బాగున్నాయి. ఈ సినిమాలో కొన్ని సీన్లు నిశితంగా గమనిస్తే విక్రమార్కుడు, హిందీ సినిమాల్లో కొన్ని గుర్తుకు వస్తాయి. కానీ వాటిని మరిపించేలా సుకుమార్ తీసుకున్న కేర్ ప్రత్యేకం.
ఇక ఈ సినిమాకు నిర్మాణవిలువలు బాగున్నాయి. వేలాదిమందికి పనికల్పించారనే చెప్పాలి. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది. సాంకేతికంగా అన్ని వనరులు ఉపయోగించుకున్నాడు సుకుమార్. నటనపరంగా అల్లు అర్జున్, రష్మిక హైలైట్ అయితే, షెకావత్ ప్రత్యేకం. మిగిలిన పాత్రలు ఎవరికివారు బాగా చేశారు. దర్శకుడు సుకుమార్ దీనికి కొనసాగింపుగా మూడో పార్ట్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. కథాపరంగా చూస్తే అంతలేకపోయినా అసలోడు వచ్చాడా? అంటూ జగపతిబాబు అనడం పుష్ప మేరేజ్ కు ఎటెండ్ కావడం, బాంబ్ బ్లాస్ట్ కావడంతో పుష్ప 3 అంటూ ముగించాడు. మరి ఈ సినిమా సక్సెస్ ను బట్టి మూడోపార్ట్ వుంటుందనే టాక్ అయితే ఇప్పటికే నెలకొంది. చూద్దాం ఏం జరుగుతుందో.
రేటింగ్ : 3/5