బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (20:32 IST)

అమరావతి ఏ పాపం చేసింది? AP అంటే A-అమరావతి .. P-పోలవరం : ఇదే చంద్రబాబు మాట

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇపుడు సరికొత్త నినాదం అందుకున్నారు. ఏపీలోని రెండు అక్షరాలలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అనే నినాదంతో ముందుకుసాగాలని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అమరావతి పరరిక్షణ సమితి తిరుపతిలో కదం తొక్కింది. ఈ సమితి ఆధ్వర్యంలో జరిగిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో తిరుపతి పట్టణ ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి పాల్గొన్నారు. ఒక్క వైకాపా మినహా మిగిలిన పార్టీలకు చెందిన నేతలు, జేఏసీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సేవ్ అమరావతి అంటూ వారు చేసిన నినాదాలతో తిరుపతి పట్టణం మార్మోగిపోయింది. 
 
అలాగే, సేవ్ అమరావతి ఉద్యమం కోసం నిధుల సేకరణలో భాగంగా చంద్రబాబు తిరుపతిలో జోలె పట్టుకున్నారు. మొత్తం 2.87 లక్షల రూపాయల మేరకు వసూలు అయింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. 'టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌ చేస్తున్నారు. నన్ను ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్‌ చేస్తారని ప్రచారం చేశారు. లెక్కలేని తనమా మీకు.. ఎంత కండకావరం..? 
 
ఎందుకు రాజధాని మారుస్తున్నారో సమాధానం చెప్పాలి. రాజధాని మునిగిపోతుందని ప్రచారం చేశారు. ఈ చరిత్రహీనులకు అమరావతి చరిత్ర కూడా తెలియదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటున్నారు. దమ్ముంటే విచారణ చేయించండి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో రాజధాని మార్చడం న్యాయమా? అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అనేది మన నినాదం. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని అన్నారు. ఈ రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లు. స్వర్ణముఖి, సోమశిల, హంద్రీనీవా ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేశాం. తిరుపతిని విద్యాకేంద్రంగా మార్చాం. ఈ ప్రభుత్వం ఉన్మాద పాలన చూసి అనేక మంది పారిపోతున్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చిన ఘనత మాదేనని ఆయన ప్రకటించారు. 
 
రాష్ట్రాభివృద్ధి కోసం ఎందుకింత తపన అని చాలా మంది నన్ను అడిగారు. భావితరాలు బాగుండాలన్నదే తన ఆలోచన అని చెప్పాను. నెనెప్పుడూ 25 యేళ్ళ యువకుడిగా ఆలోచన చేస్తానని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి మోసపోయామని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు. ఇపుడుగాని అమరావతిని కాపాడుకోలేక పోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారమని చంద్రబాబు ప్రజలకు చెప్పారు. 
 
అమరావతి అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంది. కానీ వైజాగ్ అలా లేదు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులకు చాలా దూరంలో ఉందని గుర్తుచేశారు. పైగా, ఈ ప్రభుత్వ పాలన విధ్వంసంతోనే ప్రారంభించారు. అదే పంథాను ఇపుడు కూడా కొనసాగిస్తున్నారు. రాజధాని కావాలని వైజాగ్ వాసులు ఎపుడైనా అడిగారా? రాజధానికి అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజధాని కాకపోయినా విశాఖ మహానగరంగా అభివృద్ధి చెందలేదా అని ప్రశ్నించారు. 
 
అమరావతిలో ఒక ప్రభుత్వం పరిపాలన సాగించేందుకు అవసరమైన అన్ని రకాల భవనాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఇపుడు కొత్తగా వైజాగ్ వెళితే కొత్త భవనాలు నిర్మిస్తారా? అమరావతి భూములకు తిరిగి భూమిలిస్తామంటున్నారు. ఎలా.. విమానాశ్రయం, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలను కూల్చి తిరిగి వారికి భూమిలు అప్పగిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.