చెక్కు చెదరని విక్రమ్ ల్యాండర్ .. సంబంధాల పునరుద్ధరణకు యత్నాలు...
చంద్రుడు దక్షిణ ధృవం అన్వేషణ నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌లో జాబిల్లిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ఉందట. ఇది హార్డ్ ల్యాండింగ్ సమయంలో పక్కకు ఒరిగిపోయిందేగానీ, చెక్కుచెదరలేదని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదిఏమైనా విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.
విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగే సమయంలో కమ్యూనికేషన్ కోల్పోయింది. ఇపుడు ఇది ఎక్కడుందో గుర్తించడం జరిగింది. అయితే అది ల్యాండ్ కావాల్సిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో పక్కకు ఒరిగి ఉందని ఇస్రో తెలిపింది. అదేసమయంలో విక్రమ్ ఏమాత్రం చెక్కుచెదరలేదని, దాంతో సంబంధాలు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని ప్రకటన వెలువరించింది.
చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా, 7న చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్ చివరి క్షణాల్లో చంద్రుని ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. విక్రమ్‌ను చంద్రుని వద్దకు తీసుకు వెళ్లిన ఆర్బిటర్ సాయంతో జాడ కనుగొన్నామని ఆదివారం నాడు ప్రకటించిన ఇస్రో, దాన్ని మరోసారి ధ్రువీకరించింది.
ఆన్‌బోర్డ్ కెమెరాల సాయంతో విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించామని, ఇదేసమయంలో దానితో ఎటువంటి కమ్యూనికేషన్ జరగడం లేదని తెలిపింది. సంబంధాలు పునరుద్ధరించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది.