శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్

నకిలీ రెంటల్ రసీదుతో పన్ను మినహాయింపు పొందుతున్నారా.. జర జాగ్రత్త!

income tax
చాలా మంది ఉద్యోగులు పన్ను చెల్లించకుండా ఉండేందుకు వీలుగా నకిలీ ఇంటి అద్దె రశీదులను ఆదాయ పన్ను శాఖకు సమర్పిస్తుంటారు. ఇపుడు ఇలాంటి నకిలీ రెంటల్ రసీదులపై ఆదాయపన్ను శాఖ దృష్టిసారించింది. ప్రత్యేక టెక్నాలజీ సాయంతో నకిలీలను గుర్తిస్తూ, ఇంటి అద్దెకు ఆధారాలు చూపాలంటూ పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపిస్తుంది. ఒకవేళ ఆధారాలు చెల్లించకపోయినా.. నకిలీ అని తేలితే 200 శాతం వరకు పెనాల్టీ విధించేందుకు సిద్ధమవుతుంది. 
 
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద.. ఎవరైనా తాము అద్దె ఇంట్లో ఉంటున్నట్టు పేర్కొంటే చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఇలా మినహాయింపులు కోరే వారు ఇకపై జాగ్రత్తగా ఉండాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఈ పన్ను మినహాయింపునకు ఆధారాలు చూపించాలంటూ ఆదాయ పన్ను శాఖ కోరే అవకాశం లేకపోలేదని, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి నకిలీ అద్దె రశీదులతో పన్ను రిఫండ్‌ల క్లెయిమ్ చేసుకున్న వారు ఎక్కువ మంది ఉన్నట్టు వెలుగు చూసింది. 
 
నకిలీ క్లెయిమ్‌లను గుర్తించేందుకు ఆదాయపన్ను శాఖ టెక్నాలజీ సాయం తీసుకుంటుంది. పన్ను చెల్లింపుదారులు పేర్కొనే వివరాల ఆధారంగా వాస్తవాన్ని గుర్తిస్తుంది. తల్లిదండ్రులకు అద్దె చెల్లించినట్టు రిటర్నుల్లో కొందరు చూపిస్తున్నారు. కానీ, అద్దె ఆదాయం వచ్చినట్టు వారి తల్లిదండ్రులు రిటర్నుల్లో చూపించడం లేదు. అలాంటి వారికి నోటీసులు జారీ చేస్తుంది. తప్పుడు క్లెయిమ్‌లు చేసినట్టు గుర్తిస్తే చెల్లించాల్సిన పన్నుకు 200 శాతం వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది.