శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 మే 2024 (22:22 IST)

ఆ విషయంలో అల్లు అర్జున్ చేసింది తప్పా? ఒప్పా?, పరాయివాడని నాగబాబు ఎవరినన్నారు?

Allu Arjun-Nagababu
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయో అందరూ చూసే వుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలక పార్టీ-ప్రతిపక్షాలు మాటలు తూటాలు పేల్చుకున్నాయి. ఎన్నికలు రేపు జరుగుతాయి అనగా మెగా ఫ్యామిలీ స్టార్ అల్లు అర్జున్ వైసిపికి చెందిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకి మద్దతు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ భారీగా జనసందోహం చేరింది.
 
ఒకవైపు సొంత మేనమామ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులుగా వుండి, వైసిపికి ప్రత్యర్థి పార్టీగా వున్నప్పుడు అల్లు అర్జున్ ఇలా మద్దతు తెలపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే ఓటింగ్ రోజు... తను ఏ పార్టీకి చెందినవాడిని కాననీ, ఎన్నికల్లో తన స్నేహితులు, బంధువులు ఎవరు పోటీ చేస్తున్నా వారికి పార్టీతో సంబంధం లేకుండా మద్దతు పలుకుతానని చెప్పారు.
 
ఈ విషయం ఇలావుండగా... పోలింగ్ ముగిసాక రాత్రి 10 గంటల సమయంలో జనసేన ప్రధాన కార్యదర్శి మెగాబ్రదర్ నాగబాబు ఓ ట్వీట్ చేసారు. అందులో ఆయన.. "మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ పేర్కొన్న మాటలు దుమారం రేపాయి.
 
ఈ మాటలు అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినవే అని కొందరు అంటుంటే... అదేమీ కాదు వర్మను ఉద్దేశించి చేసినవని మరికొందరు అంటున్నారు. దీనిపై నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు తనపై చేసినా పెద్దగా పట్టించుకోను కానీ, అల్లు అర్జున్ పైన చేస్తే మటుకు అవి ఆయన విజ్ఞతకే వదిలేస్తాను అని అన్నారు. మరి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారో ఆయనే చెప్పాలి.