ఫేస్‌బుక్ సరికొత్త డేటింగ్ యాప్.. యువత ఎక్కువసేపు..?
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ సరికొత్త డేటింగ్ యాప్‌ను ఆవిష్కరించనుంది. డేటా చౌర్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఫేస్‌బుక్.. డేటింగ్ యాప్ ద్వారా తేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫేస్‌బు
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ సరికొత్త డేటింగ్ యాప్‌ను ఆవిష్కరించనుంది. డేటా చౌర్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఫేస్‌బుక్.. డేటింగ్ యాప్ ద్వారా తేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫేస్‌బుక్ సరికొత్త డేటింగ్ యాప్‌ను ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా తెలిపారు. జుకర్ బర్గ్ ప్రకటన వెలువడగానే స్టాక్ మార్కెట్లో ఫేస్ బుక్ షేర్లు క్షణాల్లో పెరిగిపోయాయి.
ఈ క్రమంలో ఫేస్‌బుక్ సంస్థ ఈక్విటీ విలువ 1.1 శాతం పెరిగిందని.. త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని మార్క్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఖాతాదారులు, యువత ఎక్కువసేపు ఫేస్‌బుక్‌ను అంటిపెట్టుకుని వుంటారని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ యూజర్లను కలిగివున్న ఫేస్‌బుక్.. కొత్త యాప్ ద్వారా యువతను ఆకట్టుకోవచ్చునని భావిస్తోంది.
అంతేగాకుండా తన యూజర్లలో దాదాపు 20 కోట్ల మంది అవివాహితులే కావడంతో వారికి కావాల్సిన డేటింగ్ సేవలను దగ్గర చేయాలని మార్క్ తెలిపారు. కాగా, ఫేస్ బుక్ నుంచి డేటింగ్ సేవలు ప్రారంభమైతే, ఇదే తరహా సేవలందిస్తున్న మ్యాచ్ గ్రూప్ ఇంక్ వంటి కంపెనీలకు అతిపెద్ద సవాల్ ఎదురైనట్టేనని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.