ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (08:37 IST)

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ ఏది? భారత్‌కు ఎన్నోస్థానం?

japan passport
ఏ దేశం వారైనా మరో దేశంలో పర్యటించాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి. దీన్ని ఆయా దేశాలు మంజూరు చేస్తుంటాయి. ఆ తర్వాత తాము పర్యటించాలని భావించిన దేశం జారీ చేసే వీసాతో విదేశాల్లో పర్యటిస్తుంటారు. అయితే, ప్రపంచంలో అత్యంత శక్తిమంతైన పాస్‌పోర్టు ఏది అనే ప్రశ్న తాజాగా ఉత్పన్నమైంది. దీనికి సమాధానం కూడా లభించింది. 
 
ప్రస్తుతం జపాన్‌ పాస్‌పోర్ట్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్ట్‌ ఉన్నవారు ముందస్తు వీసా అవసరం లేకుండానే 193 దేశాలకు ప్రయాణించవచ్చు. సింగపూర్‌, దక్షిణ కొరియా కూడా దాదాపు దీనికి సమానంగానే ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టుదారులు 192 దేశాలకు సులభంగా రాకపోకలు చేయవచ్చు. 
 
ఆ తర్వాత బ్రిటన్‌ ఆరో స్థానంలో (187 దేశాలు), అమెరికా ఏడో స్థానంలో (186 దేశాలు) ఉన్నాయి. ఈ కోవలో భారత్‌ 87వ స్థానంలో (60 దేశాలు) నిలుస్తోంది. హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన పాస్‌పోర్టు సూచీ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో నిలిచాయి. అన్నింటికంటే చివరన ఆప్ఘనిస్థాన్ వుంది.