జమ్మూకాశ్మీర్‌ ప్రశాతం... 144 సెక్షన్ ఎత్తివేత

security forces
Last Updated: శుక్రవారం, 9 ఆగస్టు 2019 (19:09 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా విధించిన 144 సెక్షన్‌ను శుక్రవారం సాయంత్రం నుంచి ఎత్తివేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు, రాష్ట్ర విభజన చేయడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయని భావించి ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్‌ను విధించారు.

అయితే, కాశ్మీర్ లోయలో చాలావరకు సాధారణ ప్రశాంత జీవనం దర్శనమివ్వడంతో ఆంక్షలను సడలించారు. కాలేజీలు, పాఠశాలలు రేపు తెరుచుకోనున్నాయి. అయితే, ఇంటర్నెట్ సేవలపై నిషేధం మాత్రం కొనసాగిస్తున్నారు. కాగా, జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు క్రమంగా నెలకొంటాయని కేంద్రం భావిస్తోంది. అందుకే త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఏకాకి
మరోవైపు, కాశ్మీర్ వ్యవహారంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తుంటే దాయాది దేశం పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో తలదూర్చలేని పలు ప్రపంచ దేశాలు స్పష్టం చేశాయి. కానీ, పాకిస్థాన్ మాత్రం తాటాకు చప్పుళ్లు చేస్తోంది. ఇది అంతర్గత వ్యవహారం కాదనీ, అంతర్జాతీయ అంశమంటూ గగ్గోలు పెడుతోంది. అయితే, పాకిస్థాన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలంటూ కాళ్లావేళ్లాపడుతోంది.

తాజాగా చైనాను సంప్రదించారు. కాశ్మీర్ విషయంలో జోక్యం చెసుకోవాలంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ విజ్ఞప్తి చేశారు. అదీ కూడా తక్షణం స్పందించాలంటూ కోరారు. ఆయన వినతిని చైనా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, దక్షిణాసియాలో శాంతి నెలకొనేలా చూడాలని ఇరు దేశాలను మాత్రమే కోరగలమని చైనా తేల్చి చెప్పింది.

అలాగే, ముస్లిం దేశాలు కూడా పాకిస్థాన్‌కు వంతపాడటానికి ముందుకురాలేదు. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని, తాము ఏమీ చేయలేమని అరబ్ ఎమిరేట్స్ దేశాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే
తరహా వైఖరిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దీంతో కాశ్మీర్‌తో పాటు 370 ఆర్టికల్ రద్దు అంశాలపై పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అయింది.దీనిపై మరింత చదవండి :