చాముండేశ్వరి పాత్రలో లీనమై.. మరో వ్యక్తిపై హత్యాయత్నం
ఒక పాత్రకు అవసరమైన హావభావాలు పలికించేలా కళాకారులు, సదరు పాత్రధారి నటిస్తారు. ఇవన్నీ షూటింగ్ వరకే ఉంటాయి. అదే రంగస్థలంలో అయితే పాత్ర ముగిసే వరకూ అందులో జీవించాల్సి ఉంటుంది. అంతవరకూ పర్వాలేదు. అంతకు మించి పాత్రలో లీనమైతేనే ఇబ్బంది. ఓ వ్యక్తి ఇలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ఓ నాటక సన్నివేశంలో ఈ అపశ్రుతి చోటు చేసుకుంది.
నాటకంలో భాగంగా చాముండేశ్వరి పాత్ర ధరించిన ఓ వ్యక్తి అందులో లీనమై మహీషుడి పాత్రలో ఉన్న మరో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నెల 6న మాండ్యలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చాముండేశ్వరి పాత్రలో ఉన్న వ్యక్తి త్రిశూలంతో మహీషుడి పాత్రలో ఉన్న వ్యక్తిని పొడిచేందుకు యత్నించాడు.
నిర్వాహకులు వెంటనే అడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది. మహీషుడి పాత్రలో ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. చాముండేశ్వరి పాత్రలో ఉన్న వ్యక్తి అందులో లీనమవడమే హత్యాయత్నానికి కారణమని భావిస్తున్నారు.