ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (18:18 IST)

ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకూ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - మార్కులు మూడేళ్లు చెల్లుబాటు

ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీ కోసం వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం.. ఒకే విధానం అనే నినాదంతో ముందుకుపోతున్న కేంద్రం.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే వేర్వేరు ఉద్యోగ పరీక్షలస్థానే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని (ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశానంతరం ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు తెలిపారు.
 
ఎన్ఆర్ఏ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదంతో ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ ఏజెన్సీలకు వివిధ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే దేశంలోని సుమారు 2.5 లక్షల మంది ఉద్యోగార్ధులు ఇప్పుడు ఒకే ఒక్క (సీఈటీ) పరీక్ష ఆన్‌లైన్‌లో రాస్తే సరిపోతుంది. ఇందులో వచ్చే మార్కులకు మూడేళ్ల పాటు చెల్లుబాటులో (వాలిడిటీ) ఉంటాయి. 
 
కేంద్రం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం దేశంలోని యువతకు కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని జవదేకర్ తెలిపారు. ఎన్ఆర్ఏ వల్ల వృథా ఖర్చుల భారం తగ్గడంతో పాటు, ప్రభుత్వానికి, ఉద్యోగార్ధులకు అనవసర శ్రమ, సమయం కలిసి వస్తాయని, హడావిడి లేకుండా నిశ్చింతంగా పరీక్షలకు హాజరుకావచ్చని మంత్రి జావదేకర్ చెప్పుకొచ్చారు. 
 
కేంద్రం మంత్రిమండలి చేసిన మార్పులను ఓసారి పరిశీలిస్తే, 
 
* ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం వేర్వేరు పరీక్షలు అవసరం లేకుండా సింగిల్ ఆన్‌లైన్ సీఈటీకి హాజరైతే సరిపోతుంది.
* సీఈటీలో సాధించిన మార్కులు ఫలితాలు ప్రకటించిన మూడేళ్ల వరకూ చెల్లుబాటులో ఉంటాయి.
* తమ మార్కులు మెరుగుపరుచుకునేందుకు ప్రతి అభ్యర్థికి మరో రెండు అదనపు ఛాన్సులు ఉంటాయి. మూడింట్లో అధికంగా వచ్చిని మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు.
* ఎన్ఆర్ఏ ఇచ్చే సీఈటీ మెరిట్ లిస్ట్‌తో కాస్ట్-షేరింగ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
* దేశంలోని వైద్య, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష .. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరహాలోనే ఈ ఎన్ఆర్ఏ కూడా పనిచేస్తుంది.