శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (18:48 IST)

"సూపర్ వాసుకి" - 6 ఇంజిన్లు - 295 వ్యాగన్లు - దేశంలో అతిపొడవైన రైలు (Video)

super vasuki train
దేశంలోనే అతిపొడవైన రైలును రైల్వే శాఖ నడిపింది. సూపర్ వాసుకి పేరుతో నడిపిన ఈ రైలుకు ఆరు ఇంజిన్లు ఉండగా, 295 వ్యాగన్లు ఉన్నాయి. పైగా, దేశంలో ఇప్పటివరకు నడిపిన అతిపొడవైన రైలు ఇదే కావడం గమనార్హం. మొత్తం ఆరు ఇంజన్లతో నడిచే 3.5 కిలోమీటర్ల పొడవైన రైలుగా చరిత్ర సృష్టించింది. పైగా, మన దేశంలో ఇప్పటివరకు అతిపొడవైన రైలు ఇదేనని రైల్వే శాఖ ప్రకటించి, ఈ రైలుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 
 
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 15న రైల్వే అతిపెద్ద రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీనికి 'సూపర్ వాసుకి' అని పేరు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తోపాటు, ఆగ్నేయ మధ్య రైల్వే అధికారులు ట్విట్టరులో పోస్టు చేశారు. 
 
ఈ రైలు ప్రత్యేకతలను పరిశీలిస్తే, ఈ సూపర్ వాసుకి గూడ్సు రైలు పొడవు 3.5 కిలోమీటర్లు. 295 వ్యాగన్లను కలిగివుంది. ఈ రైలుకు ఆరు ఇంజన్లను అమర్చారు. 
 
ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నుంచి కోర్బా వరకు దీన్ని నడిపారు. ఈ రైలు ఏకంగా 27 వేల టన్నుల బొగ్గను ఒకేసారి తరలించింది. ఒకే ట్రైనులో ఇంత భారీ సరకు రవాణా చేయడం రైల్వే శాఖ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ బొగ్గుతో 3 వేల మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఒకరోజంతా నడపవచ్చని అధికారులు చెబుతున్నారు. 
 
కాగా, గతంలో వాసుకి, త్రిశూల్ పేర్లతో అతిపొడవైన గూడ్సు రైళ్లను నడిపినప్పటికీ వాటి పొడవు 2.8 కిలోమీటర్లులోపే ఉండేది. విద్యుత్ కేంద్రాల్లో ఏర్పడే బొగ్గు కొరతను నివారించడం, తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ బొగ్గును సరఫరా చేయడం కోసం ఇలాంటి పొడవైన రైళ్లను వినియోగిస్తున్నారు.