సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: గురువారం, 24 జనవరి 2019 (14:23 IST)

పవన్‌తో టిడిపి మైండ్‌ గేమ్‌..? ఏంటది?

తమకు వామపక్షాలతో మినహా ఎవరితోనూ పొత్తు వుండబోదని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ఆయన చెబుతూ వస్తున్నారు. ఎవరితోనో పొత్తులు ఉంటాయని వస్తున్న వార్తలను నమ్మవొద్దని జనసేన శ్రేణులకు సూచించారు. అయినా… తెలుగుదేశం పార్టీ పవన్‌ కల్యాణ్‌తో మైండ్‌ గేమ్‌ ఆడుతూనే వుంది. జనసేన కార్యకర్తలను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా ఈ గేమ్‌ సాగుతోంది. అందుకే…. జనసేన-టిడిపి పొత్తు వుంటుందని తాజాగా టిజి వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేనాని ఘాటుగా స్పందించారు.
 
గత ఎన్నికల్లో ఒక స్థానం కూడా తీసుకోకుండా టిడిపికి మద్దతు ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అప్పుడే ప్రకటించారు కూడా. ఆ మేరకు రానున్న ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. పూర్తికాలం రాజకీయ నాయకుడిగా పరిణమించి రాజకీయాలు నెరపుతున్నారు. మొదట్లో తన పలుకుబడిని ఉపయోగించి ప్రజలకు కొన్ని పనులు చేసిపెట్టడానికి ప్రయత్నించిన పవన్‌… ఆ తరువాత మెల్లగా టిడిపికి దూరం జరుగుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, టిడిపి ప్రభుత్వంలో అంతులేని అవినీతి జరుగుతుందని ధ్వజమెత్తడం ప్రారంభించారు.
 
గత ఎన్నికల్లోలాగే ఈ ఎన్నికల్లోనూ టిడిపికి మద్దతు ఇస్తారని, పొత్తు పెట్టుకుంటారని పవన్‌పై ఆశలు పెంచుకున్న టిడిపి… ఆయన తీరుతో నిరాశచెందింది. దీంతో పవన్‌పై రాజకీయ దాడి మొదలుపెట్టింది. పవన్‌ను బిజెపి ఆడిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అయితే…. గత కొంతకాలంగా టిడిపి తన వ్యూహం మార్చుకుంది. పవన్‌పై నేరుగా దాడి చేయడం కంటే…. పవన్‌ వెనుక ఉన్న నాయకులను, కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టడం, కన్ఫ్యూజ్ చేయడం లక్ష్యంగా వ్యవహారాలు నడుపుతోంది.
 
పవన్‌ కల్యాణ్‌ తమతోనే ఉంటారని, టిడిపితో కలిసి పోటీ చేస్తారని అప్పుడప్పుడూ ఆ పార్టీ నేతలతో మాట్లాడిస్తున్నారు. అదేవిధంగా ఉద్ధేశపూర్వకంగానే…. పవన్‌పై విమర్శలు చేయడం మానేశారు. పవన్‌ విమర్శలు చేస్తున్నా…. టిడిపి ప్రతివిమర్శలు చేయకపోవడం, ఆపై తమతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం చేయడం ద్వారా జనసైనికులను ఒక విధమైన గందరగోళానికి నెట్టేయాలన్నది టిడిపి వ్యూహం. దీనిద్వారా పవన్‌తో వెళ్లాలనుకునే టిడిపి నేతలకు బ్రేక్‌ వేయవచ్చుని భావిస్తున్నారు. టిడిపి ఆడుతున్న మైండ్‌గేమ్‌ను జనసేన అనుచురులు నమ్మితే ఆ పార్టీకి నష్టమే.
 
టిడిపి చేస్తున్న ప్రచారంలోని కోణాన్ని పసిగట్టిన పవన్‌ కల్యాణ్‌… గట్టిగానే జవాబు ఇస్తున్నారు. ఆ మధ్య ఒక వీడియో సందేశం ద్వారా… జనసేకు వామపక్షాలతో మినహా ఎవరితోనూ పొత్తు వుండదని స్పష్టం చేశారు. ఆ తరువాత కొంతకాలంలో టిడిపి నేతలు సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ టిజి వెంకటేష్‌ ద్వారా అటువంటి ప్రకటన చేయించారు. అందుకే పవన్‌ తీవ్రంగా స్పందించారు. జనసేనకు టిడిపితో పొత్తే వుండబోదన్న విషయాన్ని మరోసారి చెప్పారు. ఇప్పటికీ టిడిపి నేతలు పవన్‌ను తమ స్నేహితుడే అని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ వ్యూహం మున్ముందు ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి.