శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (11:26 IST)

గోడకు కన్నం... ముఖాలకు జంతువుల మాస్క్‌లతో నగలు కొట్టేశారు ..

దక్షిణాదిలో ప్రముఖ నగల దుకాణంగా పేరొందిన లలితా జ్యూవెలరీ షోరూమ్‌లో చోరీజరిగింది. జిల్లా కేంద్రమైన తిరుచ్చిలో ఈ దోపిడీ జరిగింది. ఉత్తర భారతానికి చెందిన ముసుగు దొంగలు ఏకంగా రూ.13 కోట్ల విలువ చేసే బంగారు, డైమండ్ నగలను కొల్లగొట్టారు. అయితే, ఈ చోరీకి పాల్పడిన వారిన ముసుగుదొంగల్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
అసలు ఈ చోరీ ఎలా జరిగిందో ఓ సారి తెలుసుకుందాం. గతేడాది తిరుచ్చి 1వ నంబరు టోల్‌గేట్‌ సమీపంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కూ ఇదే రీతిన కన్నం వేయడం గమనార్హం. అప్పుడూ బ్యాంకు గోడకు కన్నం వేసి అగంతకులు లోపలకు ప్రవేశించారు. లాకర్‌లోని రూ.5 కోట్ల విలువైన నగలను అపహరించారు. ఇపుడు కూడా ఇదే విధంగా చోరీ చేశారు. 
 
ఇద్దరు ముసుగుదొంగలు 2 గంటల్లో తమ పని పూర్తి చేశారు. షోరూమ్‌ వెనుక వైపు గోడకు కన్నం వేశారు. పిల్లలు ఆడుకొనే జంతువుల మాస్క్‌లు పెట్టుకొని సీసీ కెమెరాల కన్నుగప్పి అమ్మకాల కోసం బ్యాక్సుల్లో ఉంచిన బంగారం, వజ్రాలు మూటగట్టుకున్నారు. అలా రెండు గంటల్లోపే రూ.13 కోట్ల విలువైన ఆభరణాలతో ఉడాయించారు. 
 
అత్యంత సినీఫక్కీలో బుధవారం తెల్లవారుజామున ఈ భారీ దోపిడీ జరిగింది. గత కొన్నేళ్లలో తమిళనాడులో జరిగిన అతి పెద్ద చోరీ ఇదే. విషయం తెలిసిన వెంటనే లలిత జువెలరీ అధినేత కిరణ్‌కుమార్‌ తిరుచ్చికి వెళ్లి, షోరూమ్‌ను పరిశీలించారు. బంగారు నగలతోపాటు వజ్రాలు, ప్లాటినంతో తయారుచేసిన ఆభరణాలు చోరీకి గురయినట్టు గుర్తించారు. పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.