శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 జులై 2014 (17:44 IST)

వాస్తు: పూజగదిలో రాతి, లోహ విగ్రహాలున్నట్లైతే?

గృహంలో భగవంతుని పూజించేందుకు ఓ ప్రదేశం ఉండాలని భారతీయ వాస్తు శాస్త్రం నిర్దేశిస్తుంది. అయితే ఈ గది ప్రత్యేకంగా ఉండాలా లేదంటే ఒక అలమరాలో పెట్టుకుంటే సరిపోతుందా అన్న విషయం వారి వారి అభిప్రాయలను బట్టి మారుతుంటుంది. అలాగే గృహ వైశాల్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉండి పూజగదిని నిర్మించటానకి వీలులేనప్పుడు గోడలో అలమరా చేయించి పెట్టుకునే వీలుంది. 
 
ఒకవేళ తూర్పు వైపు తిరిగి ప్రార్థన చేయటం కుదరకపోతే ఉత్తరంవైపు తిరిగి చేయవచ్చు. పూజ చేసే గదిలో పెద్దసైజు రాతి విగ్రహాలు, లోహ విగ్రహాలకు చోటు ఇవ్వకూడదు. ఒకవేళ ఇటువంటి విగ్రహాలను పూజలో పెట్టినట్లయితే నిష్టగా పూజచేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వారు ఆ విగ్రహాలను పూజ గది నుంచి తొలగించాలి. పూజలు సరిపోని విగ్రహాలు కొంతకాలానికి రుణదృవ శక్తి నిలయాలుగా మారి గృహస్తులకు హాని కలుగజేస్తాయి. 
 
అయితే పూజ గది వల్ల ఈశాన్యం మూతపడుకూడదు. మన రాష్ట్రంలో కొన్ని పూజగదిని వాయవ్యంలో నిర్మించే సంప్రదాయం ఉంది. ఒకే ఒక్క గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ వంటిది ఏర్పాటు చేయాలి. అదే విధంగా పూజ గదిలో సిమెంటు మెట్లు పెట్టకూడదు. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి. ఇక భగవంతునికి ప్రార్థన చేసే విషయానికి వస్తే... తూర్పు దిశకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. 
 
అందువల్ల పూజగదిలో చిన్నచిన్న విగ్రహాలను పెట్టి పూజచేసుకోవటం ఎంతో ఉత్తమం. అదేవిధంగా పూజ చేసే విగ్రహాలు ఏవైనప్పటికీ వారానికోసారిగానీ, పండుగల సమయాలలోనూ, గ్రహణాల తర్వాత వారివారి సంప్రదాయాన్ని బట్టి శుభ్రం చేయాలి. నిత్యం ప్రతిరోజూ శుభ్రం చేయాలనుకునేవారు చేసుకోవచ్చు.