గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (10:43 IST)

Breastfeeding week 2021: తల్లిపాలు పసిపాపలకు ప్రకృతి ఇచ్చిన అపూర్వమైన వరం

పసిపాపలకు ప్రకృతి ఇచ్చిన అపూర్వమైన వరం... తల్లిపాలు. పిల్లల పెరుగుదలకూ, అభివృద్ధికి ప్రాథమిక దశలో ప్రధానంగా దోహదపడేది తల్లిపాలే. బిడ్డకు తల్లి పాలివ్వడమనే ఆచారం అనాది నుండే వస్తోంది. ద్రవరూపంలో తాగడానికి సిద్ధంగా వుండటమే కాకుండా అత్యుత్తమమైన పోషక విలువలు తల్లిపాలలో ఉంటాయి. పసిబిడ్డలు తల్లిపాలను సులభంగా జీర్ణించుకోవడంతో పాటు శక్తి, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ పదార్థాలను తగిన పాళ్లలో తల్లిపాల ద్వారా పొందగలుగుతారు.
 
తల్లిపాలు పోషణపరంగా బిడ్డకు చాలా మేలైనవే కాక సమతుల్యమైనవి కూడా. అంతేకాకుండా తల్లిపాలు ప్రమాదకరంగా పరిణమించే అతిసారం, శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. పసిబిడ్డల కోసం తయారు చేస్తున్న ఆహారాల్లో ఈ సుగుణాలు కనిపించవు. కొలొస్ట్రాంలోనూ, తల్లి తొలినాళ్లలో ఇచ్చే ముర్రుపాలలో పోషక విలువలు మరీ అధికంగా ఉంటాయి. పసిబిడ్డ రక్షణకు ఇవి ఎంతో ముఖ్యం కూడా. పసిబిడ్డలు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఆదర్శప్రాయమైన ఆహారం మాత్రమే కాదు తల్లి బిడ్డల మధ్య సాన్నిహిత్యం, అననురాగం వెల్లివిరియడానికి కూడా దోహదపడుతుంది.
 
బిడ్డ చక్కగా ఎదుగుతుండటం, తల్లికి మానసిక సంతృప్తిని అందిస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పసిబిడ్డలకు, పాలిచ్చే స్త్రీలకు క్యాన్సర్‌ వ్యాధి సోకడం చాలా అరుదని వైద్యులు వెల్లడిస్తున్నారు. పైగా పాలివ్వడం వల్ల అక్సీటోసిన్‌ విడుదలై గర్భాశయం సంకోచం చెందుతుంది. దీంతో రక్తస్రావం ఆగిపోతుంది. ఫలితంగా తల్లికి శరీరంలోని హార్మోన్ల ప్రభావం వల్ల రుతువులు తొందరగా రావు. దీని వల్ల గర్భదారణ ఆలస్యంగా జరిగి కాన్పుల మధ్య ఎడమ ఏర్పడుతుంది.
 
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో కొద్దిమంది తల్లులు మాత్రమే ప్రసవం తరువాత 12 గంటల లోపు పసిపిల్లలకు పాలివ్వగలుగుతున్నారు. దాదాపు 70 శాతానికి పైగా తల్లులు ప్రసవం అయిన తరువాత రెండు మూడు రోజుల వరకు ముర్రుపాలు ఇవ్వడం లేదు. ఇందుకు ప్రధాన కారణం మొదట వచ్చే పాలపై మత, సాంఘికపరమైన నమ్మకాలనే చెప్పుకోవచ్చు. ప్రసవం తరువాత మొదటి కొద్ది రోజుల వరకు తల్లిపాలు చిక్కగా లేత పసుపు రంగులో ఉంటాయి. ఈ పాలను కొలొస్ట్రం (ముర్రుపాలు) అంటారు. వీటిని నిలువ చేయబడ్డ పాలని, చిక్కని పాలని, ఈ పాలను పసిబిడ్డలు జీర్ణించుకోలేరని చాలా మంది అహాప్రాయపడుతూ పిల్లలకు ఇవ్వరు.
 
చాలా ప్రాంతాలలో వీటిని చీముపాలుగా భావిస్తుంటారు. అయితే ఈ పాలల్లో మామూలు పాల కంటే ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ చక్కెర, మరీ తక్కువ కొవు్వ ఉండటం వల్ల ఈ పాలను పసిబిడ్డలకు ఇవ్వడం శ్రేయస్కరమని పోషకాహారా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రసవం అయిన తరువాత 3 నుండి 6 రోజుల వరకు కొలొస్ట్రం క్రమక్రమంగా మామూలు పాలుగా మారుతుంది. కోలొస్ట్రం పాలను ఇవ్వడం వల్ల పి జీర్ణకోశ వ్యాధుల్ని అరికట్టడానికి వీలపవుతుంది. ఇంకా ఈ పాలు రోగ నిరోధక శక్తి కలిగి ఉండటంతో పాటు శరీర పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో కొలొస్ట్రంను చెడుపాలుగా భావించకుండా పిల్లలకు ఇవ్వడం వల్ల పోషకాలు, వాటి రక్షకాలు లభిస్తాయి.
 
పూర్వపు రోజుల్లో పిల్లలకు తొమ్మిది, పది నెలల వయస్సు రాగానే సాంప్రదాయబద్ధంగా అన్నప్రాసన జరిపి మెత్తగా వండిన వరి అన్నాన్ని పాలతో తయారు చేసిన వంటకాన్ని తినిపించేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది తల్లులు తమ పాలు బిడ్డకు సరిపోకపోవడంతో ఆరవ నెలలోనే అదనపు ఆహారాన్ని ఇవ్వాల్సి వస్తుంది. దీనికి తోడు మహిళలు ఉద్యోగాలు చేస్తుండటం వల్ల కూడా పిల్లలకు తల్లిపాలను త్వరగా మాన్పించి, అదనపు ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. బిడ్డకు మొదట ఇచ్చే అదనపు ఆహారం సాధారణంగా ఆవుపాలు, పాలు కలిపిన అన్నం, గోధుమ జావ, పాల సీసాలను ఉపయోగించి డబ్బాపాలను వాడుక చేస్తారు.
 
కాని చాలామంది తల్లులకు సరైన పాళ్లలో పాలను తయారు చేయకపోవడం, సీసాలను, పాలపీకలను శుభ్రంగా ఉంచకపోవడంతో పసిపిల్లలకు విరేచనాలు, అంటువ్యాధులు, లోప పోషణ సంభవించడం జరుగుతుంది. ఈ దశలో 4-65 మాసాల నుండి పిల్లలకు అనువైన ఘన ఆహార పదార్థాలు పెడుతూ కనీసం రెండు సంవత్సరాల పాటు పాలు ఇవ్వడం అవసరం. అయితే పిల్లలు ఈ ఘన ఆహారం తీసుకోవడంలో ఉత్సాహం చూపిస్తే ఆరు మాసాల వరకు తల్లిపాలు ప్రధానాహారంగా ఉండాలి. ఈ కాలంలో ఇతరత్రా ఆహారం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.
 
అలాగే పిల్లలకు పాలిచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్తనం నుండి 10 నుండి 20 నిముషాల వరకు పాలు ఇస్తూ ఉండాలి. పాలు ఉండటం ప్రారంభమైన 23 నిముషాలకు పాలు కారడం జరుగుతుండటం వల్ల తల్లి బిడ్డకు ఒక స్తనంతో పాలిస్తున్నప్పుడు రెండో స్తనం నుంచి బొట్టులు, బొట్లుగా కారడం తల్లులకు తెలిసిన విషయమే. పాలు తాగుతున్న స్తనం నుంచి బిడ్డను త్వరగా తప్పించినట్లయితే పాలు స్రవించే అసంకల్పిత చర్య బలహీనపడి, పాలు చిక్కగా స్రవించడం దెబ్బ తింటుందని శాస్త్ర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.