బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (15:54 IST)

గర్భిణీ మహిళలు.. ఆ క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా వుండండి..

దాదాపు ప్రతి 3000 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ భారిన పడుతున్నారు. గర్భిణి స్త్రీలలో వక్షోజాలలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడం కష్టతరం కనుక అధిక శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు పరిస్థితి తీవ్రమైన తర్వాతే బయటపడుతున్నాయి. ఎక్కువ మంది వైద్యులు సాధారణ గర్భధారణ పరీక్షలలో భాగంగా రొమ్ము క్యాన్సర్ పరీక్షలను కూడా సిఫార్సు చేస్తున్నారు.
 
రొమ్ము క్యాన్సర్ ఉన్నవారు వైద్యులు సూచించిన మేరకు సరైన తేదీల్లో సంప్రదించాలని గుర్తుంచుకోండి. గర్భధారణ సమయంలో రొమ్ము క్యాన్సర్ సమస్యకు చికిత్స చేసేటప్పుడు అనేక విషయాలు పరిగణించవలసి ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ అనేది సాధారణంగా గర్భధారణ సమయంలో చేసే పరీక్షలలోనే గుర్తించడం జరుగుతుంటుంది. 
 
క్యాన్సర్ యొక్క లక్షణాలుగా రొమ్ము సున్నితత్వం, లేదా ఛాతీ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, ఇవి గర్భధారణ సమయంలో మహిళల రొమ్ముల్లో సంభవించే మార్పులను పోలి ఉంటాయి. ఒకవేళ వైద్యులు రొమ్ములో అనుమానాస్పద కణితిని కనుగొన్న ఎడల, సాధారణంగా ప్రభావిత రొమ్ముకు, మామోగ్రఫీ కన్నా, అల్ట్రాసౌండ్ చేయడం ఉత్తమంగా సూచించవచ్చు. 
 
మామోగ్రఫీ గర్భస్థ పిండానికి హానికరం అని చెప్పబడింది. రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారించబడ్డ తరువాత, గర్భస్థ శిశువు మీదనే ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది. అయితే, తల్లి తీసుకునే చికిత్సలు, గర్భస్థ పిండంమీద ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇవి ఎంపిక చేసిన చికిత్సల మీద ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు పెరుగుతున్న శిశువు మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పబడింది. అందుకని సాధారణంగా, ప్రసవం తర్వాతగానీ చికిత్సను ప్రారంభించరు. అప్పటి వరకు కాన్సర్ కణాలు పెరుగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంటుంది. కీమోథెరపీని గర్భధారణ సమయంలో చేయించుకోవచ్చు.
 
కానీ దానిని మొదటి త్రైమాసికంలో చేయరు. అలా చేస్తే శిశువు ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. రెండవ మరియు మూడవ త్రైమాసికంలో కీమోథెరపీ చేయడం కొంతమేర సురక్షితంగా ఉంటుంది. కాకపోతే ఇందులో కూడా, శిశువు తక్కువ బరువుతో జన్మించడం లేదా, ముందస్తు జననం వంటి సమస్యలను తరచుగా ఎదుర్కోవడం గమనించబడింది. 
 
వైద్యులు ప్రసవానికి రెండు నుండి మూడు వారాల ముందు కీమోథెరపీని నిలిపివేస్తారు. గర్భం దాల్చిన మొదట్లోనే క్యాన్సర్ సమస్యను గుర్తించినట్లయితే, కణితిని తొలగించడానికి ఉత్తమమైన మార్గంగా సర్జరీని సూచించవచ్చు. క్రమంగా గర్భస్థ శిశువు మీద ఎటువంటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తపడవచ్చు. చికిత్సా విధానాలు రెండు రకాలుగా ఉన్నాయి. అందులో మొదటిది మాస్టెక్టమీ. ఈ ఆపరేషన్లో రొమ్ము భాగాన్ని పూర్తిగా తొలగించడం జరుగుతుంది. 
 
రెండవది రొమ్ము సంరక్షణ శస్త్రచికిత్స. క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించడం జరిగితే, ప్రసవం అయ్యే వరకు చికిత్సను వాయిదా వేయడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు మీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంలో కొన్ని ప్రద్ధతులను ఆచరించవలసి ఉంటుంది. ఒకవేళ మీ క్యాన్సర్ పూర్తి స్థాయిలో తొలగించడం కొరకు శస్త్రచికిత్సను పాటించవలసి ఉండి, మరియు కీమోథెరపీ లేదా రేడియోథెరపీ అవసరంలేని పక్షంలో మాత్రమే, మీరు మీ బిడ్డకు తల్లిపాలను అందించేందుకు ఆస్కారం ఉంది. కీమోథెరపీ లేదా రేడియోథెరపీ అవసరమైతే తల్లిపాలు ఇవ్వకూడదు.