శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (13:34 IST)

కరోనావైరస్: శరీరంలో వైరస్ కణాలు చనిపోయినా.. టెస్టుల్లో ‘పాజిటివ్’ అని వస్తోందా?

కోవిడ్-19కి చేసే ప్రధానమైన పరీక్ష చాలా సున్నితమైనది. మనకు ఇంతకుముందే వైరల్ ఇంఫెక్షన్ సోకి ఉంటే.. అది తగ్గిన తరువాత కూడా వైరస్ మృత కణాలు శరీరంలో ఉండవచ్చు. కోవిడ్-19కు చేసే ముఖ్యమైన పరీక్షలో ఈ మృత వైరస్ కణాలను పరిగణనలోకి తీసుకుని 'పాజిటివ్' అని చూపించే అవకాశాలున్నాయని సైంటిస్టులు అంటున్నారు.

 
శరీరంలో వైరస్ ఒక వారం కన్నా ఎక్కువకాలం సజీవంగా ఉండదు. కానీ కొన్ని వారాల తరువాత కూడా పరీక్షల్లో పాజిటివ్ వస్తోందంటే మృత కణాలను పరిగణనలోకి తీసుకుంటోందనే అర్థం. కానీ ఇంతకన్నా కచ్చితంగా పరీక్షించే పద్ధతేమిటో స్పష్టంగా తెలియట్లేదని పరిశోధకులు అంటున్నారు.

 
"పరీక్షా ఫలితాలు పాజిటివ్ లేదా నెగటివ్ అని వెల్లడయ్యే కంటే… ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉండి, చాలా కొద్ది మొత్తంలో ఉన్న వైరస్‌ను విస్మరించగలిగేలా పరీక్షలు ఉంటే మనకు మెరుగైన ఫలితాలొస్తాయి" అని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ కార్ల్ హెనెఘన్ అభిప్రాయపడుతున్నారు.

 
ఒకపక్క కోవిడ్-19 కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్నా, ఆస్పత్రిలో చేర్చవలసిన అత్యవసర పరిస్థితులు చాలా తక్కువగానే ఉంటున్నాయంటే మృత వైరస్ కణాల వలన కూడా పరీక్షల్లో పాజిటివ్ రావడమే కారణం కావొచ్చు అని ఆయన అన్నారు.

 
కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన వారినుంచీ సేరించిన వైరల్ కణాలను ఒక పారదర్శక పాత్రలో ఉంచి వైరస్ ఎదుగుతుందా లేదా గమనిస్తారు. మృత కణాలైతే వైరస్ ఎదగదు. సజీవ కణాలైతే వైరస్ వృద్ధి చెందుతుంది. ఇలాంటి పరిశోధనలు జరిపిన 25 అధ్యయనాలను యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లోని సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ పరిశోధకులు పరిశీలించారు.

 
మృత కణాల సమస్య ఉండవచ్చని మొదటినుంచే అనుమానాలున్నాయి. ఇందుకే కోవిడ్ 19 డాటా పూర్తిగా విశ్వసనీయం కాదు. ఈ కారణాల వలన R సంఖ్య గందగోళాన్ని సృష్టిస్తోందని పరిశోధకులు అంటున్నారు. బహుశా అందుకే ప్రపంచంలో చాలా దేశాల్లో కోవిడ్-19 కేసులు అధికస్థాయిలో ఉన్నా రికవరీ రేటు కూడా అంతే ఎక్కువగా ఉంటోంది.

 
అయితే అన్ని దేశాల్లోనూ క్రమక్రమంగా వ్యాపారాలు, సాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. పాఠశాలలు, మాల్స్, పార్కులు, మెట్రో రైళ్లు మొదలైనవన్నీ మెల్లిమెల్లిగా తెరుచుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అది ఎంతవరకూ ప్రమాదకరం అనేది సందేహమే!

 
కోవిడ్ -19 టెస్ట్ ఎలా చేస్తారు?
పీసీఆర్ స్వాబ్ టెస్ట్ ద్వారా వైరస్ ఉందా లేదా నిర్ధారిస్తారు. స్వాబ్ టెస్ట్ ద్వారా తీసుకున్న నమూనాను ప్రయోగశాలలో అనేకమార్లు పరీక్షించి... నిర్ధారణకు కావలసినంత వైరస్‌ను సేకరిస్తారు. అయితే అనేక సైకిల్స్‌లో పరీక్షిస్తున్నప్పుడు ఎన్నిసార్లు తక్కువ వైరస్ కలక్ట్ అవుతోంది, ఎన్నిసార్లు ఎక్కువ వైరస్ కలక్ట్ అవుతోందో చెప్పడం కష్టం.

 
వైరస్‌ను సేకరించడానికి ఎక్కువసార్లు పరీక్షాలు జరపాల్సి వస్తే వైరస్ వృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అయితే కోవిడ్-19 టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ లేదా నెగటివ్ ఫలితాలు వస్తున్నాయిగానీ శరీరంలో ఎంత మోతాదులో వైరస్ ఉంది, అది ప్రమాదకస్థాయిలో ఉందా లేదా కొంచమే ఉందా అనేది తెలియదు.

 
చాలా ఎక్కువ మోతాదులో వైరస్ ఉన్న వ్యక్తికి, మృత కణాలు లేదా చాలా కొద్ది మొత్తంలో వైరస్ ఉన్న వ్యక్తికీ కూడా పరీక్షలో పాజిటివ్ అనే వస్తుంది. కట్ ఆఫ్ పాయింట్‌లాంటిది ఉంటే ఫాల్స్ పాజిటివ్ ఫలితాలను నిరోధించవచ్చని ప్రొఫెసర్ హెనెఘన్ అంటున్నారు. ఫలితంగా పాత వైరస్ మృత కణాల వలన పాజిటివ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంటున్నారు. దీనివల్ల ఎక్కువమంది క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రజల్లో భయాందోళనలు తగ్గుతాయి అని అంటున్నారు.

 
అయితే కట్ ఆఫ్ పాయింట్ నిర్ణయించడం కష్టమనీ, కొందరు పేషెంట్లలో 8 రోజుల తరువాత కూడా సజీవంగా ఉన్న వైరస్ కణాలు కనిపించాయని, శరీరంలో వైరస్ ఎంతకాలం సజీవంగా ఉంటుందో తేల్చి చెప్పడం కష్టమని, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందనీ కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.