ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:51 IST)

మొబైల్ ఉత్పత్తి విడి భాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు.. తగ్గనున్న ఫోన్ల ధరలు

budget2
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యంతర బడ్జెట్‌ను దాఖలు చేయడానికి ముందు మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించే విడి భాగాల ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గించింది. మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. 
 
సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 5 శాతం తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్‌ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్‌ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించింది.
 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో భారతదేశంలో ఫోన్‌లను ఉత్పత్తి చేసే కంపెనీలకు మరింత ఊరట కలుగనుండగా.. దిగుమతి సుంకం తగ్గడంతో మొబైల్‌ఫోన్ల ధరలు సైతం తగ్గే అవకాశాలున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదికలో స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ప్రభుత్వం చర్య మేక్ ఇన్ ఇండియాను ఊతమిస్తుందని చెప్పింది.