బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (12:29 IST)

ఆంధ్రాలో 'కరోనా' దూకుడు : మరో 60 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా శుక్రవారం కూడా మరో 60 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ గత 24 గంటల్లో నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 7,902 శాంపిల్స్‌ను పరీక్షించగా 60 మందికి పాజిటివ్ వచ్చిందని ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటివరకూ ఏపీలో 1463 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
403 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో కరోనా వల్ల ఇప్పటిదాకా 33 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 1027గా ప్రభుత్వం ప్రకటించింది.
 
కాగా, గత 24 గంటల్లో నమోదైన 60 కరోనా పాజిటివ్ కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఒక్క కర్నూలు జిల్లాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరింది. 
 
కర్నూలు తర్వాత గుంటూరులో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అనంతపురంలో 6, విశాఖపట్నంలో 2, పశ్చిమ గోదావరిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
 
రెడ్ - ఆరెంజ్ - గ్రీన్ జోన్లు ఏవి?
కరోనా ప్రభావిత రాష్ట్రాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ అనే మూడు జోన్లుగా విభజించాయి. ఈ జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇపుడు రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. 
దేశ వ్యాప్తంగా రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆరెంజ్‌ జోన్‌లో 284, గ్రీన్‌జోన్‌లో 319 జిల్లాలు ఉన్నట్లు తెలిపింది. రెడ్‌జోన్‌లో అత్యధికంగా యూపీలోని 19 జిల్లాలు, మహారాష్ట్రలోని 14 జిల్లాలు, తమిళనాడులో 12, ఢిల్లీ 11, బెంగాల్‌లో 10 జిల్లాలను కేంద్రం చేర్చింది. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు జోన్లలో మార్పులు చేశామని ప్రీతి సూడాన్ స్పష్టం చేశారు. 
 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్రం కొన్ని మార్పులు చేయడం గమనార్హం. కేంద్రం చేసిన తాజా మార్పులతో ఏపీలోని 13 జిల్లాల్లో 5 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. 7 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో చేర్చారు. తెలంగాణలో రెడ్‌జోన్‌లో 6 జిల్లాలు, ఆరెంజ్‌ జోన్‌లో 18 జిల్లాలు, గ్రీన్‌జోన్‌లో 9 జిల్లాలను చేర్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
 
ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ జోనులో ఉన్న జిల్లాలను పరిశీలిస్తే, కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి.
అలాగే, ఆరెంజ్‌ జోనులో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ జిల్లాలు, గ్రీన్ జోనులో విజయనగరం జిల్లా మాత్రమే ఉంది. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలోని రెడ్ జోన్ జిల్లాలను పరిశీలిస్తే హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉండగా, ఆరెంజ్ జోనులో నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కుమ్రం భీం అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల, గ్రీన్ జోనులో పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, ఏపీలో రెడ్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. కేంద్రం చేసిన తాజా మార్పులతో ఏపీలోని 13 జిల్లాల్లో 5 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. 7 జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లో చేర్చారు.