కరోనా దూకుడు : కొత్తగా 78 వేల కేసులు.. ప్రమాదకారిగా మారిన 5 రాష్ట్రాలు

india - covid
ఠాగూర్| Last Updated: బుధవారం, 2 సెప్టెంబరు 2020 (11:41 IST)
దేశంలో కరోనా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ఈ వైరస్ దూకుడుకు అడ్డుకట్టపడేలా కనిపించడం లేదు. ఫలితంగా దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం కొనసాగుతోంది. బుధవారం కూడా మరో 78 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల్లో 78,357 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 1,045 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 37,69,524కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 66,333 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 29,019,09 మంది కోలుకున్నారు. 8,01,282 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 4,43,37,201 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,12,367 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సవాల్ విసురుతున్న ఆ రాష్ట్రాలు
ఇదిలావుంటే, దేశంలో రోజుకు 70 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అంతేకాదు... కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
india report

అయితే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగడం లేదని, కేవలం ఐదు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కొత్త కేసులు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా వ్యాధి బారిన పడుతున్న వారిలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వాసులే అధికమని, ఈ ఐదు రాష్ట్రాల నుంచే మొత్తం కేసులలో 56 శాతం వస్తున్నట్టు పేర్కొంది.

అదేసమయంలో కోలుకుంటున్న వారిలో 58 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని, మరణాలు సైతం ఇక్కడే అధికంగా సంభవిస్తున్నాయని వైద్య శాఖ వెల్లడించింది. మంగళవారం దేశంలో 819 మంది చనిపోగా, అందులో 536 మంది ఈ ఐదు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం.

ఇదేసమయంలో రికవరీ రేటు 77 శాతం వరకూ ఉండటం, యాక్టివ్ కేసులతో పోలిస్తే, చికిత్స తర్వాత రికవరీ అయిన వారి సంఖ్య 3.61 రెట్లు అధికంగా ఉండటం ఒకింత ఉపశమనాన్ని కలిగిస్తోంది. మొత్తంమీద దేశంలో కరోనూ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు.దీనిపై మరింత చదవండి :