శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (10:02 IST)

భయం భయం... దేశంపై కరోనా పంజా : కొత్తగా 3.50 లక్షల కేసులు

దేశం యావత్తూ భయం భయంగా ఉంది. దేశంపై కరోనా వైరస్ పగబట్టింది. దీంతో దేశ ప్రజలంతా ఈ వైరస్ దెబ్బకు వణికిపోతున్నారు. ఈ క్రమంలో గత 24 గంటల్లో ఏకంగా 3.50 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న విషయం తెల్సిందే. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా లక్షల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. 
 
అయితే.. రోజురోజూకు వీటి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుదున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఆదివారం దేశవ్యాప్తంగా 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2812 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,13,163 (1.73 కోట్లు)కు పెరగగా.. మరణాల సంఖ్య 1,95,123 కి చేరింది. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి.. అత్యధిక కోవిడ్ -19 కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.
 
ఇదిలావుంటే.. ఆదివారం కరోనా నుంచి 2,19,272 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,43,04,382 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 28,13,658 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.