శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (12:45 IST)

దేశంలో కరోనా బూస్టర్ డోస్ ప్రారంభం - తెలంగాణాలో ప్రారంభించిన హరీష్ రావు

దేశవ్యాప్తంగా కరోనా బూస్టర్ డోస్ టీకాల పంపిణీ ప్రారంభమైంది. తొలు 60 యేళ్లు పైబడినవారితో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఈ బూస్టర్ డోస్‌ టీకాను వేస్తున్నారు. మొదటి రెండు డోసులను తీసుకుని 9 నెలలు గడిచినవారికి ఈ టీకాలు వేస్తున్నారు. అయితే, ఈ రెండు డోసుల టీకాను ఏ రకమైతే తీసుకున్నారో అదే డోస్ వ్యాక్సిన్‌ను ఇపుడు బూస్టర్ డోస్ కింద వేస్తున్నారు. 
 
ఈ బూస్టర్ డోస్‌లను తొలి దశలో ఏకంగా 5.75 కోట్ల మందికి ఇవ్వనున్నారు. ఇందులో 2.75 కోట్ల మంది 60 యేళ్లు పైబడినవారు వ్యక్తులు ఉండగా, కోటి మంది హెల్త్ వర్కర్లు, 2 కోట్ల మంది ఫ్రంట్‌‍లైన్ వారియర్లు ఉన్నారు. అయితే, ఈ బూస్టర్ డోస్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ అక్కర్లేదని నేరుగా వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లి టీకాలు వేసుకోవచ్చని పేర్కొంది. 
 
తెలంగాణాలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగిపోయింది. దీంతో భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. మొన్నటివరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. కానీ, ఇది మరింత ఉధృతంగా వ్యాపిస్తుంది. ఒకవైపు కరోనా వైరస్‌తో మరోమారు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కరోనా బూస్టర్ టీకాలు వేస్తున్నారు. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణా రాష్ట్రంలో కూడా చేపట్టనున్నారు. సోమవారం నుంచి కరోనా బూస్టర్ డోస్‌ టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 60 యేళ్లు పైబడిన వారితో పాటు కోవిడి వారియర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ టీకాలు తొలుత వేస్తున్నారు. 
 
మొదటి, రెండో డోస్ తీసుకున్న వ్యాక్సిన్‌నే మూడో డోస్ బూస్టర్ డోస్‌గా వేయాలని అధికారులు సూచించారు. అదేసమయంలో రెండో డోస్ తీసుకున్న వారు 9 నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని సూచించారు. ఇదిలావుంటే, ఈ బూస్టర్ డోస్ టీకా కార్యక్రమాన్ని చార్మినార్ యునాని ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.