ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (11:39 IST)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : విండీస్‌కు భంగపాటు.. ఇంగ్లాండ్‌ విజయం

దుబాయ్ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌కు ఓటమి స్వాగతం పలికింది. బ్యాటర్లు విఫలమైన వేళ... బౌలర్లు రాణించినప్పటికీ ఇంగ్లండ్ చేతిలో ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 55 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఇంగ్లిష్ జట్టు తడబాటుకు గురైంది. 
 
ఛేదనలో 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. జేసన్ రాయ్‌ (11), బెయిర్‌స్టో (9), మొయిన్‌ అలీ (3), లివింగ్ స్టోన్ (1) స్కోర్లకే వెనుదిరిగారు. జోస్ బట్లర్‌ (24*), మోర్గాన్ (7) నాటౌట్‌గా నిలిచారు. విండీస్‌ బౌలర్లలో హోసైన్ 2, రవి రాంపాల్ ఒక వికెట్ తీశారు. 
 
లక్ష్యం చిన్నదైనా వెస్టిండీస్ బౌలర్లు ఏ మాత్రం వెనుకాడలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. తొలుత బ్యాటింగ్‌లో మరికాస్త పరుగులు రాబట్టి ఉంటే విండీస్‌ గెలిచేందుకు అవకాశాలు ఉండేవి.
 
క్రిస్‌ గేల్‌.. పొలార్డ్.. రస్సెల్.. పూరన్..హెట్మెయిర్.. బ్రావో.. వీళ్లంతా భారీ హిట్టర్లు. అలవోకగా సిక్సర్లను బాదేస్తారు. అలాంటిది విండీస్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం ఒక్కటంటే ఒక్కటే సిక్సర్‌ నమోదు కావడం గమనార్హం. అదీ లూయిస్ (6) కొట్టినదే. విండీస్‌ జట్టులో క్రిస్‌ గేల్ (13) ఒక్కడే టాప్ స్కోరర్. 
 
మిగతా బ్యాటర్లలో సిమన్స్ (3), హెట్మెయిర్ (9), బ్రావో (5), పూరన్ (1), పొలార్డ్ (6), హోసైన్ (6*), రాంపాల్ (3) స్వల్ప రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్‌ అదిల్ రషీద్‌ (4/2) విజృంభణతో విండీస్‌ కుప్పకూలింది. కీలకమైన వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనాన్ని అతడు శాసించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్ 2, మొయిన్ 2.. జొర్డాన్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ తీశారు.