మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:37 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ మ్యాచ్ : ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

cricket stadium
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శుక్రవారం రెండు బలమైన జట్లు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షానికి తుడిచిపెట్టుకుని పోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఈ మ్యాచ్ వర్షార్పణమైంది. అలాగే, ఉదయం ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు చేశారు. 
 
ఈ రెండు మ్యాచ్‌లకు మెల్‌బోర్న్ వేదికగా కేటాయించారు. అయితే, ఇక్కడ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం మెల్‌బోర్న్‌లో వర్షం కురవకపోయినా, మైదానం ఆటకు ఏమాత్రం అనువుగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ రద్దు అయింది. ఫలితంగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. 
 
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒకదాంట్లో ఓడిపోగా, ఒకదాంట్లో గెలిచింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది.