శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (09:13 IST)

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో భారత క్రికెట్ జట్టు.. బంగ్లాపై తొలి టెస్ట్ గెలిస్తే చరిత్రే!!

team india
భారత టెస్ట్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో ఉంది. ఈ నెల 19వ తేదీన పర్యాటక బంగ్లాదేశ్ జట్టుతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 92 యేళ్ల తర్వాత అరుదైన రికార్డును సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు మొత్తం 579 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 178 మ్యాచ్‌లలో గెలిచిన భారత్ జట్టు సరిగ్గా 178 మ్యాచ్‌లలో ఓడిపోయింది. మిగిలిన 223 మ్యాచ్‌లలో 222 టెస్టులు డ్రాగా ముగియగా, ఒక మ్యాచ్ టై అయింది. ఈ నేపథ్యంలో చెన్నైలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే... టెస్ట్ క్రికెట్‌లో ఓటముల కన్నా విజయాలను ఎక్కువగా సాధించిన జ్టుటగా టీమిండియా రికార్డు ఎక్కుతుంది. 
 
ఇప్పటివరకు ఈ రికార్డును భారత్ అందుకోలేకపోయింది. ఒకవేళ ఈ రికార్డును వచ్చే టెస్టులో సాధిస్తే 1932 తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. అంటే 92 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుందన్న మాట. ఇక కీలకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లకు ఈ రెండు మ్యాచ్‌లు సిరీస్ చాలా కీలకం. ఇందులో భారత్ గెలిస్తే తన పాయింట్లను మరింత మెరుగుపరచుకుంటుంది. ప్రస్తుతం భారత్ 68.52 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, ఆస్ట్రేలియా 62.50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
 
మరోవైపు పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లా టైగర్స్ 45.83 పాయింట్లతో టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకారు. దీంతో ఆ జట్టు కూడా భారత్‌తో టెస్టు సిరీస్‌ను కీలకంగా భావిస్తోంది. ఒకవేళ టీమిండియాపై గెలిస్తే ఆ జట్టు పాయింట్లు మెరుగవుతాయి.
 
కాగా, ఈ నెల 19వ తేదీ ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలో చిదంబరం స్టేడియంలో శిక్షణా కార్యక్రమంలో పాల్గొంది. కాగా, జులైలో రాహుల్ ద్రవిడ్ నుంచి ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతీకి ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. 
 
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్రీత్ బుమ్రా, యశ్ దయాల్.