ధోనీ స్థానమే భర్తీ చేయలేను.. ఇక ధోనీకి వారసుడిని ఎలా అవుతాను?
భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసే క్రికెటర్ కనుచూపుమేరలో లేరనీ భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్‌గా ఎన్నికైన రిషబ్ పంత్ అభిప్రాయపడ్డారు. పైగా, తనను ధోనీ వారసుడు అనడాన్ని కొట్టిపారేశారు.
వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. దీనిపై పంత్ స్పందిస్తూ, ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం సామాన్యమైన విషయం కాదని, దీన్నో సవాలుగా తీసుకుంటానని తెలిపాడు.
ధోనీ వారసుడు అంటూ మీడియాలో వస్తున్న కథనాల పట్ల తాను ఆలోచించడం మొదలుపెడితే సమస్యలు తప్పవని అన్నాడు. అందుకే తాను జట్టుకు ఏంచేయగలనో దానిపైనే శ్రద్ధ చూపిస్తానని, దేశం కోసం మెరుగైన ప్రదర్శన కనబర్చాలని కోరుకుంటానని తెలిపాడు.
ఇదే తన మొదటి ప్రాధానత్య అని అన్నాడు. నేర్చుకోవాల్సిన, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెడుతున్నానని పంత్ చెప్పాడు. వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే టీమిండియాలో 21 సంవత్సరాల రిషభ్ పంత్ కు ప్రధాన వికెట్ కీపర్ స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ టూర్‌కు ధోనీ దూరంగా ఉన్నాడు.