ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (09:35 IST)

ప్రపంచ కప్‌ను ఐదోసారి ముద్దాడిన యువ భారత్ - ఇంగ్లండ్ చిత్తు

యువ భారత్ ప్రపంచ కప్‌ను ఐదోసారి ముద్దాడింది. శనివారం ఆంటిగ్వా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో ఇంగ్లండ్ జట్టును చిత్తుగా ఓడించారు. బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. అదేసమయంలో భారత బ్యాట్స్‌మెన్లు కూడా అర్థసెంచరీలతో ఆదరగొట్టారు. ఫలితంగా ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐదోసారి ప్రపంచ కప్‌ను సొంతం చేుకున్నారు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 189 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కుర్రాళ్ళో 47.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఆరంభంలో కొంత తడబడినట్టు కనిపించి యువ భారత్.. ఆ తర్వాత పుంజుకుంది. 
 
ఓపెనర్ రఘువంశీ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ చక్కని సమయస్ఫూర్తితో క్రీజ్‌లో పాతుకునిపోయాడు. మరో ఓపెనర్ హర్నూర్‌ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 21 పరుగు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 
 
అయితే, అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వస్తున్న కెప్టెన్ యధ్ థుల్ (17) కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలేక పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు పట్టుబిగించినట్టు కనిపించింది. అయితే, రషీద్ మాత్రం జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించాడు. రషీద్ అర్థ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాజ్ బవా చక్కని ఆట తీరును ప్రదర్శించాడు. 35 పరుగులు చేసి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు నుంచి లాగేశాడు. పిమ్మట వికెట్ కీపర్ దినేశ్ బానాతో కలిసి నిశాంతి ఎలాంటి ఆందోళన చెందకుండా జట్టును విజయతీరానికి చేర్చాడు. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
అంతకుముందు ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులు చేసింది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయింది. ముఖ్యంగా, రాజ్‌ బవా వేసిన పదునైనా బంతులు ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకున్నారు. మరోవైపు రవి కుమార్ దాడితో ఇంగ్లండ్ వణికిపోయింది. దీంతో 91 పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడినట్టు కనిపించింది. య్యితే, జేమ్స్ రేవ్ అద్భుతపోరాట పటిమను ప్రదర్శించడంతో ఇంగ్లండ్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.