అక్లాండ్ వన్డే మ్యాచ్ : శ్రేయాస్ మెరుపులు - భారత్ 306 రన్స్
అక్లాండ్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత్ బ్యాటింగకు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు అర్థ శతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
ముఖ్యంగా, శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌కు పని చెప్పాడు. ఫలితంగా 76 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు. తొలుత ఓపెనర్‌లు ధావన్ 77 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేయగా, మరో ఓపెనర్ గిల్ 65 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఫలితంగా వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యంతో మంచి పునాది వేశారు.
అయితే, మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్, రిషబ్ పంత్‌లు మరోమారు నిరాశపరిచారు. నాలుగో నంబరుగా బరిలోకి దిగిన పంత్ 23 బంతుల్లో 15 పరుగులు చేయగా, సూర్య కుమార్ 4, సంజూ శాంసన్ 36, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేశారు. ఫలితంగా భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌లు మూడేసి వికెట్లు తీశారు.