భారత క్రికెటర్లు పిచ్చోళ్లా? క్రీడా స్ఫూర్తిని గౌరవించాలి : పాకిస్థాన్ కెప్టెన్
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఉద్దేశ్యపూర్వకంగానే ఓడిపోయిందన్న వ్యాఖ్యలను పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కొట్టిపారేశారు. భారత క్రికెటర్లు ఏమైనా పిచ్చోళ్ళా అంటూ మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని గౌరవించాలన్నారు.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. నెట్ రన్‌రేట్‌లో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టిన న్యూజిలాండ్ సెమీస్‌కు చేరి, మంగళవారం భారత్‌తో తలపడనుంది.
అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓడిపోవడం వల్లే పాకిస్థాన్ సెమీస్‌కు చేరలేదనీ, కోహ్లీ సేన కావాలనే ఇంగ్లండ్ చేతిలో ఓడిందని పాకిస్థాన్‌కు చెందిన అనేక మాజీ క్రికెటర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి చేరుకున్న సర్ఫరాజ్ అహ్మద్ కరాచీలో విలేకరులతో మాట్లాడుతూ, ఇంగ్లాండ్‌పై టీమిండియా కావాలనే ఓడిపోయిందన్న ఆరోపణలు సరికాదని అన్నాడు.
పాకిస్థాన్ సెమీస్ చేరకుండా భారత్ ఈ విధంగా కుట్ర చేసిందన్న వాదనలు సమంజసం కాదని, తమను అడ్డుకోవడానికి కోహ్లీ సేన కావాలనే ఓటమిపాలైందని తాను అనుకోవడంలేదని స్పష్టం చేశాడు. భారత్ కారణంగా తమ సెమీస్ అవకాశాలు దెబ్బతిన్నాయని తాను భావించడంలేదని తెలిపాడు.
కోహ్లీ సేన కావాలనే ఓడిందంటూ కొందరు మాజీ చాంపియన్లు వ్యాఖ్యానించడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమన్నారు. పైగా, పాక్‌ను సెమీస్ రేసు నుంచి తప్పించడానికి టీమిండియా కుట్రపూరితంగా ఓడిందంటూ ఇష్టం వచ్చినట్టు వకార్ యూనిస్ తదితరులు చేసిన వ్యాఖ్యలను సర్ఫరాజ్ కొట్టిపారేసి.. నిజమైన క్రీడాస్ఫూర్తితో వ్యాఖ్యలు చేసి శభాష్ అనిపించుకున్నాడు.