గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (13:56 IST)

గంగూలీని చిక్కుల్లో పడేసిన కుమార్తె... (video)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టానికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి కుమార్తె సనా గంగూలీ రూపంలో కొత్త చిక్కు వచ్చిపడింది. 
 
క్యాబ్ (సీఏఏ)పై తన ఇన్‌స్టాగ్రామ్‌లో సనా పెట్టిన కథనాలు దుమారం రేపడంతో గంగూలీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చెలరేగగా, దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రక జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) వర్సిటీ విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. విద్యార్థులపై పోలీసులు అతిగా స్పందించడం విమర్శలకు కారణమైంది.
 
ఈ నేపథ్యంలో సనా గంగూలీ ప్రముఖ రచయిత కుష్కంత్ సింగ్ రాసిన 'ది ఎండ్ ఆఫ్ ఇండియా' నవలలోని సారాంశాన్ని పోస్టు చేసింది. జేఎంఐ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చిన్న వయసులోనే ఎంతో పరిణతితో సనా వ్యవహరించిందని కొందరు ప్రశంసించగా, మరికొందరు వ్యతిరేకించారు. రానురాను ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుండడంతో గంగూలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
 
'నా కుమార్తె చిన్నపిల్ల. రాజకీయాల గురించి తనకి అంతగా అవగాహన లేదు. ఆ పోస్టు నిజం కాదు. అందువల్ల ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి. నాకుమార్తెను వివాదాలకు దూరంగా ఉంచండి... ప్లీజ్' అంటూ ట్వీట్ చేశారు.