గురువారం, 18 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (14:51 IST)

రోహిత్ స్థానంలో హార్దిక్ పటేల్... అసలు కారణ వెల్లడించిన ఎంఐ కోచ్

rohit - hardkia pandya
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పటేల్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించారు. తాజాగా ఆయన ఓ క్రికెట్ చానెల్‌తో మాట్లాడుతూ, 'ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయమే. నా వరకు ఇదో పరివర్తన దశ మాత్రమే. చాలా మందికి ఈ విషయం అర్థంగాక, భావోద్వేగానికి గురయ్యారు. కానీ, ఆటకు సంబంధించిన విషయాల్లో ఉద్వేగాలను పక్కనబెట్టాలి. ఓ ఆటగాడిగా రోహిత్‌ నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం మేలుచేస్తుంది. అతడు మరింత స్వేచ్ఛతో ఆడి మంచి పరుగులు సాధించనివ్వండి' అని తెలిపారు.
 
ఇక, ఐపీఎల్‌లో క్రికెటేతర బాధ్యతలు కూడా కెప్టెన్సీ మార్పునకు మరో కారణమని మార్క్‌ వెల్లడించారు. 'గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో రోహిత్‌ బ్యాట్‌తో రాణించలేకపోయాడు. అందుకే అతడి భుజాలపై బాధ్యతలను తగ్గించాలనుకున్నాం. లీగ్‌ టోర్నీలో కెప్టెన్‌కు ఆట కాకుండా చాలా బాధ్యతలుంటాయి. ఫొటోషూట్స్‌, ప్రకటనల వంటివి కూడా చూసుకోవాలి' అని మార్క్‌ వెల్లడించారు.
 
కాగా, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఐపీఎల్ వర్గాల్లో పెను తుఫాను సృష్టించిన విషయం తెల్సిందే. జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యను సారథిగా నియమించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. దీంతో ఆ ఫ్రాంఛైజీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై జట్టు కోచ్‌ మార్క్‌ బోచర్‌ వివరణ ఇవ్వడం గమనార్హం.