గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By మోహన్
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (14:48 IST)

పాకిస్థాన్ కివీస్‌పై గెలిస్తేనే..?

ప్రపంచకప్ అనూహ్య విజయాలు, సంచలనాలు మరియు పరాజయాలతో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్ రేస్ నుండి తప్పుకున్నాయి. ఈ సమయంలో బుధవారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. 
 
ఇప్పటి వరకు పరాజయాలతో టోర్నీలో పడుతూ లేస్తూ సాగుతున్న పాకిస్థాన్, వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్ ఆరు మ్యాచ్‌లు ఆడి, రెండింటిలో గెలిచి, మూడింటిలో ఓడింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు కాగా 5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
 
మరోపక్క పాయింట్‌ల పట్టికలో కివీస్ రెండో స్థానంలో ఉంది. మరొక మ్యాచ్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ దశకు చేరుకోవడానికి కివీస్ ఉవ్విళ్లూరుతోంది.
 
కాగా పాక్ జట్టు సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న కివీస్‌ను నిలకడలేని ఆటతీరు కనబరుస్తున్న పాక్ ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.