కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా నల్లారికి రాజకీయ సన్యాసం తప్పదా? ఎందుకు?
ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. తరువాత కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రాజకీయాల్లో అభాసుపాలయ్యారు. తిరిగి సొంతగూటికి చేరి తన సత్తా చాటాలని చూశారు. అయితే అక్కడా ఇమడలేకపోతున్నారు. పార్టీలో ఉండలేక, ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత.. ఏంటా కథ?
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. ఒకవైపు యువజన ఉద్యమాలు జోరుగా జరుగుతున్నా పరిపాలన గాడి తప్పకుండా సత్తా చాటారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చివరి వరకు హడావిడి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయారు. విధిలేని పరిస్థితుల్లో రాజీనామా చేసి బయటకు వచ్చారు. తరువాత జై సమైక్యాంధ్రపార్టీతో ప్రజల్లోకి వెళ్ళినా ఎక్కడా డిపాజిట్ దక్కలేదు. ఆ ఎదురుదెబ్బ నుంచి కోలుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డికి నాలగేళ్ల సమయం పట్టింది. యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న ఆయన కొన్నినెలల క్రితం తన సొంత పార్టీ కాంగ్రెస్‌లో చేరారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డికి అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి బాగా పట్టున్న నియోజకవర్గం పీలేరు. తన స్వస్థలం నగరిపల్లె. తండ్రి అమరనాథరెడ్డి రాజకీయాన్ని వారసత్వంగా తీసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అందుకే వై.ఎస్. హయాంలో కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. కిరణ్ చేరికతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అధిష్టానం భావించింది.
కానీ కిరణ్ మాత్రం చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఇంటిపోరు. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా నామినేటెడ్ పదవిని అనుభవిస్తున్నాడు. దీంతో నల్లారి కుటుంబానికి సహకరిస్తున్న పీలేరు నియోజకవర్గంలోని అనుచరులు అందరూ దాదాపుగా కిషోర్ కుమార్ రెడ్డి వెంట నడుస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో టిడిపికి మంచి పట్టే ఉంది.
పీలేరు ఇన్‌ఛార్జ్‌గా కూడా కిషోర్ కుమార్ రెడ్డిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కిషోర్ చురుగ్గా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడే కిరణ్‌కు అసలు సమస్య వచ్చి పడుతోంది. సొంత తమ్ముడి వెంట నల్లారి అనుచరులందరూ వెళ్ళిపోవడంతో కిరణ్ ఏకాకిగా మారిపోయారు. ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కిరణ్ ఉన్నప్పుడు వెంట నడిచిన నేతలెవరూ కూడా ఇప్పుడు లేరు. కొంతమంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు.
మొదట్లో కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది. కానీ కిరణ్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో లేదంటున్నారు సన్నిహితులు. రాజంపేట నుంచి ఎంపిగా పోటీ చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలన్నది కిరణ్ ఆలోచన. ఇదంతా బాగానే ఉంది కానీ కిరణ్‌కు సపోర్ట్ చేసే వారే కరువైపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పీలేరులో పర్యటించారు కిరణ్. అయితే తన వెంట ఎవరూ రాలేకపోయారు. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రమే రెండు, మూడు హోర్డింగ్‌లను కిరణ్ స్వాగతం అంటూ ఏర్పాటు చేశారు. దీంతో ఆలోచనలో పడిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి.
తన సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే తాను పోటీ చేయబోతున్న రాజంపేట పరిధిలోని నియోజకవర్గంలో తిరిగితే ఇంకెలాగ ఉంటుందోనన్న ఆలోచనలో పడిపోయారు. ఇంటి నుంచి అస్సలు రావడం లేదు. పర్యటనలు పెట్టుకోవడం లేదు. రాజంపేట నుంచి కూడా పోటీ చేద్దామా వద్దా అన్న సుదీర్ఘ ఆలోచనలోకి వెళ్ళిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి.
ఇప్పుడిప్పుడే పార్టీ మారకుండా ఉన్న పార్టీలోనే కాలం గడుపుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారం నిర్వహించి చేతులు దులుపుకోవడం ఖాయమన్న నిర్ణయానికి కూడా కిరణ్ వచ్చేశారట. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కన్నా హుందాగా ఉండడమే నూటికి నూరుపాళ్ళు మంచిదన్నది కిరణ్ అభిప్రాయమంటున్నారు కార్యకర్తలు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో మరి చూడాలి.