శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (13:00 IST)

వైఎస్.వివేకా పాలిట ప్రత్యర్థులుగా మారిన ఫ్యామిలీ మెంబర్స్?

మహానేత ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు పొడచూపిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ముఖ్యంగా, వైఎస్ జగన్, వైఎస్ వివేకానంద రెడ్డిలు రాజకీయంగా విడిపోయారు.

మహానేత ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు పొడచూపిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ముఖ్యంగా, వైఎస్ జగన్, వైఎస్ వివేకానంద రెడ్డిలు రాజకీయంగా విడిపోయారు. ఫలితంగా జగన్ కొత్త పార్టీ పెడితే, వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రిపదవి చేపట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మపై పులివెందుల స్థానంలో కాంగ్రెస్ ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి చిత్తుగా ఓడిపోయారు. అలా వైఎస్ ఫ్యామిలీలో రాజకీయ వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి కుటుంబసభ్యులే కారణంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
వాస్తవానికి పులివెందుల వైఎస్‌ ఫ్యామిలీకి పెట్టనికోట. కానీ, వైఎస్ ఫ్యామిలీలో విభేదాల ప్రభావం పులివెందులపై క్రమేపీ పట్టు కోల్పోతుందట. ఇటు రాజకీయాలు కలిసిరాకపోవడంతో పాటు అనేక సమస్యలతో సతమతమవుతోన్న జగన్‌కి కుటుంబసభ్యులు కూడా సమస్యగా మారారట! జగన్‌ పెదనాన్న, చిన్నాన్న కుటుంబాల్లో మూడు ఫ్యామిలీలు మాత్రం రాజకీయాల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. పులివెందులలో మాత్రం జగన్‌ బాబాయిలు వివేకానంద రెడ్డి.. భాస్కర్‌ రెడ్డి... మనోహర్‌ రెడ్డి కుటుంబాలు నివశిస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నాయి.
 
వీరిలో భాస్కర్‌ రెడ్డి కుమారుడే కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి. మనోహర్‌ రెడ్డి పులివెందుల మునిసిపల్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన భార్య వైస్‌ ఛైర్మన్‌ పదవిలో ఉన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాం నుంచి ఇవాళ్టి వరకు పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నది వీరే! అయితే తన సొంత తమ్ముడు కావడంతోనే వివేకానంద రెడ్డికి రాజశేఖర్‌ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఇచ్చారని.. తమకు మాత్రం అంతేసి పెద్ద పదవులు ఇవ్వలేదని భాస్కర్‌ రెడ్డి, మనోహర్‌రెడ్డి కుటుంబాలు కాసింత అసంతృప్తితో ఉండేవట! వైఎస్‌ మరణానంతరం ఈ అసంతృప్తి మరింత పెరిగిందట! అది గమనించిన జగన్‌.. భాస్కర్‌ రెడ్డి కుమారుడు అవినాశ్‌రెడ్డిని ఎంపీని చేశారట. 
 
అయితే, పదవులు వారివే అయినా పెత్తనమంతా జగన్ కుటుంబసభ్యులదేనన్న టాక్ కూడా పులివెందులలో వినిపిస్తుంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ వేలు పెడుతుండటంతో మనోహర్‌ రెడ్డి విసిగిపోయారట. దీన్ని మనసులో పెట్టుకున్న మనోహర్ రెడ్డి... గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగిన వైఎస్ వివేకానంద రెడ్డిని ఉద్దేశ్యపూర్వకంగానే ఓడించినట్టు ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా.. వైఎస్ మరణానంతరం వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమనడం వైఎస్ అభిమానులను తీవ్ర క్షోభకు గురిచేస్తున్నాయని చెప్పొచ్చు.