సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:24 IST)

2021లో కొత్త ఇల్లు కొనే యోచనలో భారతదేశ యూహెచ్ఎన్‌డబ్ల్యూఐలలో ప్రతీ 5 మందిలో ఒకరు

భారతదేశ అల్ట్రా హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్ డబ్ల్యూఐ), 30 మిలియన్ డాలర్లకు మించిన ఆస్తులు కలిగిన వారి సంఖ్య రాబోయే ఐదేళ్లలో 63 శాతం వృద్ధి చెంది 11,198కి చేరుకోనుందని ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అయిన నైట్ ఫ్రాంక్ తన వెల్త్ రిపోర్ట్ 2021లో వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశం 6,884 మంది యూహెచ్ఎన్ డబ్ల్యూఐలకు, 113 మంది బిలియనీర్లకు నిలయంగా ఉంది.
 
భారతదేశంలోని బిలియనీర్ల క్లబ్ 2025 నాటికి 162కు చేరుకొని 43% మేర గణనీయంగా వృద్ధి చెందనుంది. ఈ వృద్ధి ప్రపంచ సగటు వృద్ధి 24 శాతాన్ని, ఆసియా సగటు 38 శాతాన్ని అధిగమించనుంది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలోని 1% కుబేరుల్లో చేరేందుకు ఓ వ్యక్తికి 60,000 డాలర్లు అవసరం. ఈ సంపద వృద్ధి అంచనాల ప్రకారం భారతదేశపు 1% కుబేరుల క్లబ్ రానున్న ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది.
 
మక్కువతో పెట్టే పెట్టుబడుల పరంగా చూస్తే, భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐలకు ఆభరణాలు అనేది అత్యంత ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉంటోంది. ఆ తరువాత కళలు, గడియారాలు, వైన్, క్లాసిక్ కార్లు ఈ జాబితాలో ఉంటున్నాయి. ప్రపంచ ధోరణులకు అనుగుణంగానే 2020లో భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐలు కూడా అరుదైన విస్కీతో పోలిస్తే వైన్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 
 
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021లో భాగంగా కంపెనీ చేపట్టిన ఆటిట్యూడ్స్ సర్వే ప్రకారం, 2021లో భారతదేశంలో కొత్త ఇల్లు కొనుక్కుందామనుకునే యూహెచ్ఎన్ డబ్ల్యూఐల సంఖ్యలో పెరుగుదల చోటుచేసుకుంది. నైట్ ఫ్రాంక్ యొక్క వెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం, ప్రతీ ఐదుగురు భారతీయ అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తుల్లో ఒకరు 2021లో ఒక కొత్త ఇల్లు కొనే యోచనలో ఉన్నారు.
 
అంతర్జాతీయంగా యూహెచ్ఎన్ డబ్ల్యూఐలలో 43 శాతం మంది 12 నెలల క్రితంతో పోలిస్తే, పర్యావరణం, సామాజికం, పాలన (ఈఎస్ జి) ఫోకస్డ్ పెట్టుబడులపై మరింత ఆసక్తితో ఉన్నారు. భారతదేశంలో అల్ట్రావెల్తీ భారతీయుల్లో 46% మంది ఈఎస్జి ఫోకస్డ్ పెట్టుబడులపై ఆసక్తితో ఉన్నారు. అయితే ఈఎస్జి ఫోకస్డ్ ప్రాపర్టీలపై పెట్టుబడి పెట్టడంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఈఎస్జి సంబంధిత పెట్టుబడి అవకాశాలను పొందేందుకు తమకు మరింత సమాచారం అవసరమని భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐలలో 89% మంది భావిస్తున్నారు.
 
నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మహమ్మారి అనంతర కాలంలో ఆర్థిక కార్యకలాపాలు సామర్థ్యపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో, భారత్ రాబోయే కొన్నేళ్లలోనే 5 ట్రిలియన్ డాలర్ క్లబ్‌లో చేరేందుకు బాటలు వేసుకుంటోంది. భారత్ ఆర్థికంగా మరింత శక్తివంతం కానుంది. ఆసియా సూపర్ పవర్‌గా సుస్థిరస్థానం సాధించనుంది. కొత్త రంగాలకు అది బాట వేయనుంది. నూతన ఆర్థిక అవకాశాలు ఆకర్షణీయ సంపద సృష్టి ఆస్తులను అందించనున్నాయి. అవి దేశంలో కొత్త సంపన్నులను జోడించనున్నాయి’’ అని అన్నారు.
 
2021కి సంబంధించి ప్రైమ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ మెంట్ ప్రాధాన్యాలు:
నైట్ ఫ్రాంక్ యొక్క వెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం, ప్రతీ 5 మంది భారతీయ అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తుల్లో ఒకరు 2021లో ఒక కొత్త ఇల్లు కొందామని భావిస్తున్నారు. 2020లో ఇది ప్రతీ 10 మందిలో ఒకరిగా ఉండింది. కుటుంబ ప్రధాన నివాసాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడం, నూతన హాలీడే హోమ్‌ను కొనడం, శాశ్వతంగా ఓ కొత్త దేశానికి లేదా టెరిటరీకి వెళ్లిపోవడం వంటి మూడు ప్రధాన కారణాలను ఈ కొత్త కొనుగోళ్లకు కారణాలుగా చెబుతున్నారు. కోవిడ్ 19 మహమ్మారి సైతం నివాసాల కొనుగోళ్ల ప్రవర్తన ధోరణులను ప్రభావితం చేసింది. తీర ప్రాంతాలు మరియు స్కై డెస్టినేషన్స్ అనేవి అంతర్జాతీయంగా కూడా నూతన ప్రాధాన్యపూరితాలుగా మారిపోయాయి. అయితే, భారతదేశంలో యూహెచ్ఎన్ డబ్ల్యూఐలలో 41 శాతం మంది కొత్త ఇంటిని రిసార్ట్/తీర ప్రాంతంలో కొందామని చూస్తున్నారు.
 
2021 మరియు ఆ తరువాత సంపద సృష్టి:
అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, అల్ట్రా వెల్తీ భారతీయులు 2020లో తమ సంపదలో 59% వృద్ధి చవిచూశారు. 2021లో భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐలలో 91 శాతం మంది ఒక కొత్త ఆర్థిక చక్రం ప్రారంభం కావడం ద్వారా తమ సంపదలో వృద్ధిని చవిచూశారు. యూహెచ్ఎన్ డబ్ల్యూఐల సంఖ్యలో భారీ పెరుగుదల ఆసియాలో చోటు చేసుకోగలదని నైట్ ఫ్రాంక్ భావిస్తోంది. ఇక్కడ ఈ వృద్ధి 39 శాతం దాకా ఉండవచ్చు.
 
ఇండోనేషియా (69%), భారత్ (63%) దీనికి సారథ్యం వహించనున్నాయి. ఈ కాలంలో ఇండోనేసియా తన యూహెచ్ఎన్ డబ్ల్యూఐ జనాభాలో 67 శాతం వృద్ధిని చవిచూసింది. అంతర్జాతీయంగా అదే అత్యధికం. సంఖ్యపరంగా చూస్తే ఇండోనేసియాకు పదింతలుగా భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐల సంఖ్య ఉంటుంది.
 
ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ గ్లోబల్ హెడ్ లియామ్ బెయిలే మాట్లాడుతూ, ‘‘ఆసియా కీలక సంపద గాధ. అంచనా వేసిన కాలానికి అమెరికా ప్రపంచపు ఆధిక్యపూర్వక వెల్త్ హబ్‌గా కొనసాగనుంది. అయినా కూడా రాబోయే ఐదేళ్ళ కాలంలో యూహెచ్ఎన్ డబ్ల్యూఐలలో వృద్ధిని ఆసియా చవిచూడనుంది. ప్రపంచ సగటు 27 శాతం కాగా, అది ఇక్కడ 39%గా ఉండనుంది. 2025 నాటికి మొత్తం యూహెచ్ఎన్ డబ్ల్యూఐలలో ఆసియా 24% మందిని కలిగి ఉండనుంది. దశాబ్దం క్రితం ఇది 17%గా ఉండింది. ఈ ప్రాంతం ఇప్పటికే ఇతర ప్రాంతాలతో పోలిస్తే అధికంగా బిలియనీర్లను కలిగిఉంది. (ప్రపంచ మొత్తంలో 36%). ఈ భావనకు చైనా కీలకంగా ఉండనుంది. 2025 నాటికి యూహెచ్ఎన్ డబ్ల్యూఐలలో 246% అంచనా వృద్ధిని చైనా సాధించనుంది’’ అని అన్నారు.
 
మిలియన్ అమెరికన్ డాలర్లతో ఎంత స్థలం కొనవచ్చు?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా మొనాకొ కొనసాగనుంది. 2020 లెక్కల ప్రకారం, ఇక్కడ 1 మిలియన్ అమెరికన్ డాలర్లతో 15 చ. మీటర్ల స్థలం మాత్రమే కొనగలం. ముంబైలో ఈ మొత్తంతో ప్రైమ్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో 106 చ. మీటర్ల స్థలం కొనవచ్చు. 2019లో ఇది 102 చ.మీ.గా మాత్రమే ఉండింది.
 
కీలక నగరాల్లో 1 మిలియన్ అమెరికన్ డాలర్లతో ఎన్ని చ.మీటర్ల ప్రైమ్ ప్రాపర్టీని కొనవచ్చు?
మొనాకో- 15 చ.మీ, హాంగ్ కాంగ్- 23, లండన్- 31, న్యూయార్క్- 34, జెనీవా- 35, సింగపూర్- 36, పారిస్- 42, లాస్ ఏంజెల్స్- 44, సిడ్నీ- 45, షాంఘై- 50, టోక్యో- 58, బీజింగ్- 62, బెర్లిన్- 70, మయామి- 85, మెల్బోర్న్- 87, ముంబై- 106, ఇస్తాంబుల్- 112, దుబాయ్- 165, కేప్ టౌన్- 202, సౌవ్ పౌలో- 252.