శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (14:26 IST)

భారతీయులకు శుభవార్త చెప్పిన అగ్రరాజ్యం.. రికార్డు స్థాయిలో వీసాలు

us visa
భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త చెప్పింది. ఈ యేడాది భారతీయులకు రికార్డు స్థాయిలో పది లక్షల మేరకు వీసాలను జారీ చేయనున్నట్టు తెలిపింది. దీంతోపాటు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. 
 
ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళుతున్న విద్యార్థుల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య రెండో స్థానంలో ఉన్నారు. పైగా, భారతీయులు అధికంగా కోరుకునే హెచ్1బీ, ఎల్ వర్క్ వీసాల జారీకి ఇకపై అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇదే విషయంపై అమెరికా విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి డోనాల్డ్‌లు మాట్లాడుతూ, భారత్ - అమెరికా ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన వర్క్ వీసాలకు మేం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. వీటి జారీకి భారత్‌లోని కొన్ని రాయబార కార్యాలయాల్లో 60 రోజుల కంటే తక్కువ సమయం పడుతుంది అని వివరించారు. 
 
అలాగే, హెచ్1బీ వీసాలు ఉండి ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ వృత్తి నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవడానికి ఏమేం చేయాలో సూచించారు. అమెరికన్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విధి విధానాలను విడుదల చేసిందని తెలిపారు. భారత్ - అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు అమెరికాలో గొప్ప మద్దతు ఉంది. భారతీయ అమెరికన్లు గత మూడు దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. ప్రతి యేడాది 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇరు దేసాల మధ్య ప్రయాణిస్తూ ఉంటారు. ప్రస్తుతం లక్ష మంది వరకు అమెరికన్లు భారత్‌లోనూ నివసిస్తున్నారు అని డొనాల్డ్ వివరించారు.