ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (09:07 IST)

ఐపీఎల్ 2020 : తిరుగులేని ముంబై - రాజస్థాన్ రాయల్స్ చిత్తు

ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు యూఏఈ వేదికగా హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రతి ఒక్క జట్టూ గెలుపే లక్ష్యంగా ఆడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లన్నీ ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 20వ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (79) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లు, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోవడంతో ముంబై ఖాతాలో మరో విజయం పడింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మరోమాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు డికాక్ (15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 23 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ (23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు) క్రీజులో కుదురుకున్నప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. 
 
డికాక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఝళిపించాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 79 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆఖరులో హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేయడంతో ముంబై 193 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ 2 వికెట్లు పడగొట్టగా, జోఫ్రా అర్చర్, కార్తిక్ త్యాగి చెరో వికెట్ తీసుకున్నారు. 
 
ఆ తర్వాత 194 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి పేలవంగా ఆడింది. ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ తొలి ఓవర్ రెండో బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఏడు పరుగుల వద్ద కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (6) పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాతి నుంచి వికెట్ల పతనం కొనసాగింది.
 
ఆదుకుంటాడనుకున్న సంజు శాంసన్ డకౌట్ కాగా, గత మ్యాచ్‌లో మెరిసిన మహిపాల్ లొమ్రోర్ కూడా నిరాశ పరిచాడు. ఫలితంగా 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు క్రీజులో కుదురుకున్న జోస్ బట్లర్ మాత్రం చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్లు పడిపోతున్నా ఒంటరిగా పోరాడాడు.
 
అయితే, సహచరుల నుంచి అతడికి ఎటువంటి సహకారం లేకపోవడంతో అతడి ఇన్నింగ్స్ వృథా అయింది. 44 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. బట్లర్ తర్వాత కాస్తోకూస్తో ఆడింది జోఫ్రా అర్చరే. 11 బంతులు ఎదుర్కొన్న అర్చర్ 3 ఫోర్లు, సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. బట్లర్ అవుటయ్యాక చివరి వరుస బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా 18.1 ఓవర్లకు 136 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 57 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. రాహుల్ చాహర్, కీరన్ పొలార్డ్ చెరో వికెట్ పడగొట్టారు.
 
కాగా, ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలో గెలిచి 8 పాయింట్లతో  మెరుగైన రన్‌రేట్ కారణంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే, వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన రాజస్థాన్ 4 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక, ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.