ఐపీఎల్ 2020.. గౌరవంగా నిష్క్రమించిన సీఎస్కే.. ధోనీకి ఇది చివరి మ్యాచ్ కాదు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలుపును నమోదు చేసుకుంది. ఈ సీజన్‌లో ఆరు విజయాలతో ముగించింది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలకు సీఎస్‌కే గండికొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సీఎస్‌కే టోర్నీ నుంచి గౌరవంగా నిష్క్రమించింది.
ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్ 14 మ్యాచ్‌లకు గాను 12 ఇన్నింగ్స్‌లు ఆడి 199 పరుగులు చేశాడు. ఇది ధోని నుంచి వచ్చిన నిరాశజనకమైన ప్రదర్శన. అదే సమయంలో ఈ సీజన్‌లో ధోని ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
ఇలా తన ఐపీఎల్ కెరీర్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా ఒక సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ను తాను ఆడతాననే విషయాన్ని ధోని స్పష్టం చేశాడు. టాస్ సమయంలో అతనికి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా తాను ఇంకా ఆడతాననే సంకేతాలిచ్చాడు.
యెల్లో జెర్సీలో ఇది మీ చివరి మ్యాచ్ కావొచ్చా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం ఇచ్చాడు. ఈ సీజన్‌లో ధోని ఆకట్టుకోలేనంత మాత్రాన అతన్ని తక్కువగా అంచనా వేయొద్దని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పేర్కొన్నాడు.