శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (16:04 IST)

విశాఖలో ఇన్ఫోసిస్ పెట్టుబడులు - మంత్రి గుడివాడకు తెలియకుండానే..

infosys
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ విశాఖపట్టణంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందుకోసం అక్కడ పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. ముఖ్యంగా, తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులు, కొత్తగా నియమించుకుంటున్న ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది టైర్-2 సిటీల నుంచి వస్తున్నారని, అందుకే అలాంటి క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇందుకోసం ఏపీలో మొత్తం నాలుగు టైర్-2 నగరాలను ఎంపిక చేసింది. 
 
ఇందులోభాగంగా, వెయ్యి మంది ఉద్యోగులతో తొలి క్యాంపస్ పెట్టే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ప్రమేయమే లేదు. పైగా, మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అసలు విషయమే తెలియదు. ఇన్ఫోసిస్ సొంతంగా ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండానే ఈ క్యాంపస్‌లను నెలకొల్పనుంది. మేమే వెళ్లాం.. మేమే తీసుకొచ్చాం అనే ప్రచారానికి తావులేకుండా, రాజకీయ నేతల ప్రమేయం అస్సలు లేకుండా ఈ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ భావిస్తుంది. 
 
అయితే, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఈ క్యాంపస్‌ను స్థాపించడం సాధ్యమేనా అనే చర్చ కూడా సాగుతోంది. పైగా, ప్రభుత్వం పెద్దలు ఈగోలకు వెళితే మాత్రం ఇన్ఫోసిస్ తన నిర్ణయం మార్చుకునే అవకాశం లేకపోలేదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.