హైదరాబాదులో వాట్సాప్ హ్యాకర్లు.. వెరిఫికేషన్ కోడ్ చెప్పారంటే (Video)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌పై సైబర్ నేరగాళ్లు పడ్డారు. ఇతరుల ఫోన్ నంబర్లతో తమ ఫోన్లలో వాట్సాప్‌ను యాక్టివేట్ చేసుకొని వాటి ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా సైబర్ ఎటాక్‌లో భాగంగానే మంగళవారం ఒక్కరోజే హైదరాబాద్‌లో వందలాది మందికి చెందిన వాట్సాప్‌లు క్రాష్ అయ్యాయి. వారిలో కొందరు సెలబ్రెటీలు సైతం ఉన్నారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు.
వివిధ రకాలైన సైబర్ క్రిమినల్స్ బాధితులకు కనిపించరు. కేవలం కాల్స్, సందేశాలతో ఎరవేసి, అందినకాడికి దండుకుంటూ ఉంటారు. దీనికోసం ఒకప్పుడు ఈ సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉపయోగించే వారు. అయితే ఇలా చేయడం వల్ల పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా పట్టుకొనే అవకాశం ఉండటంతో ఇటీవల కాలంలో సైబర్ నేర గాళ్లు యాప్స్ వినియోగిస్తున్నారు. వాటితోనే కాల్స్ చేస్తున్నారు.
ఇందుకోసం ఎక్కువ మం ది వాడే వాట్సాప్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ యాప్ 'ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రి ప్టెడ్' కావడంతో సైబర్ నేరగాళ్లతోపాటు ఉగ్రవాదులూ వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగింది. దీంతో సైబర్ నేరగాళ్లు తాజాగా వాట్సాప్ టేకోవర్ స్కామ్స్ మొదలెట్టారు.
సైబర్ క్రిమినల్స్ తమ ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఏదో ఒక సిరీస్ నుంచి ఓ ఫోన్ నంబర్‌ను వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేస్తున్నారు. దీంతో వెరిఫికేషన్ కోడ్ ఆ నెంబర్‌కు వెళ్లిపోతోంది. ఆ వెంటనే నేరగాళ్లు ఆ నంబర్ గల వారికి 'ఓ కోడ్ పొరపాటున మీ ఫోన్‌కు పంపాను. దయచేసి నాకు తిరిగి పంపండి' అంటూ ఫోన్ లేదా సందేశం ద్వారా అడుగుతున్నారు. ఆరు డిజిట్స్‌తో ఉండే ఈ వెరిఫికేషన్ కోడ్‌ను అందుకున్న వ్యక్తి సైబర్ నేరగాడికి చెప్పిన వెంటనే... అతడి వాట్సాప్ ఖాతా సైబర్ నేరగాడి ఫోన్‌లోకి మారిపోతుంది.
ఆ వెంటనే అసలు వ్యక్తి ఫోన్‌లోని వాట్సాప్ క్రాష్ అయిపోతుంది. ఒకసారి వాట్సాప్ క్రాష్ అయితే ఆ ఖాతాలోని డేటాను కోల్పోతారు. ఈ తరహా మోసాల బారినపడకుండా ఉండాలంటే ఫోన్లకు వచ్చే వెరిఫికేషన్ కోడ్స్‌ను ఎవరికీ పంపకూడదు, చెప్పకూడదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.