బీహార్‌లో భీకర పేలుడు - కుప్పకూలిన భవనాలు.. ప్రాణనష్టం
బీహార్ రాష్ట్రంలో భీకర పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ పేలుడు రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో జరిగింది.
గురువారం రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఏడుగురు మరణించగా, పలువురుకి గాయాలయ్యాయి. ఈ పేలుడు శబ్దాలు 4 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించాయి. కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతమంతా కంపించింది. అంటే ఈ పేలుడు ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు.
తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కజ్‌బాలి చక్‌లో ఈ ఘటన జరిగింది. కాగా, ఈ పేలుడులో మృతి చెందినవారంతా ఎన్నోయేళ్లుగా బాణాసంచా తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన బాణాసంచాను ఇంటిలో నిల్వచేసి వుంటారని, ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.