శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (15:39 IST)

చంద్రబాబు అరెస్టుతో ఆయనకే మేలు జరుగుతుంది : ఫరూక్ అబ్దుల్లా

farooq abullah
అవినీతికి పాల్పడినట్టు ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడం వల్ల ఆయనకే మేలు చేకూరుతుందని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ఈ చర్యను ఏపీ ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా మంగళవారం జాతీయ వార్తాసంస్థ ఏఎస్ఐతో మాట్లాడారు.
 
"ఏపీలో చంద్రబాబు విషయంలో అక్కడి ప్రభుత్వం చాలా పెద్దతప్పు చేసింది. ఎన్నికల ముందు సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్న నేతను అరెస్ట్ చేసి, జైలుకు పంపితే ఆయన బలహీన పడతారనుకోవడం పొరపాటు. ఇలా జైలుకు పంపడం వల్ల చంద్రబాబు మరింత బలపడతారు. ఆయన బలపడటం ద్వారా సమాజానికి ప్రయోజనం చేకూరుతుందని నేను స్పష్టంగా చెబుతున్నా. ఒకవైపు జీ-20 సదస్సు జరుగుతుండగా.. మరోవైపు గొప్ప నేతను అరెస్ట్ చేయడం చాలా బాధ కలిగించింది. ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి'' అని ఆయన కోరారు.
 
అలాగే, యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ అరెస్టుపై స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వ చర్యను ఖండించారు. ప్రశ్నించేవారిని జైలుకు పంపడం... ప్రస్తుత నిరంకుశ పాలకుల రీతిగా మారిందని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఇలాంటి పెడపోకడలకు పోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 
 
'ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి జైళ్లకు పంపే సంస్కృతి కేంద్రం నుంచి రాష్ట్రాలకు పాకింది. ప్రభుత్వంలో ఉన్న వారికి సహకరించని వారందరినీ జైలుకు పంపుతున్నారు. ఇలాంటి పెడ పోకడలకు పోతే భవిష్యత్తులో వారే అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని భాజపా, దాని అవకాశవాద మిత్రులు గుర్తుంచుకోవాలి' అని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.